సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను.
కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు. సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో అనిపించుకోవాలని నాకు లేదు. ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం ఖచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది అన్నారు.