సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80సంవత్సరాలు. ఆదివారం అర్ధరాత్రి స్వల్ప గుండెపోటుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని, 48గంటల పాటు ఆయన పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితం ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు.
గుంటూరు జిలా బుర్రిపాలెంలో1942 మే 31న జన్మించారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఇందిరా దేవి, విజయ నిర్మల. విజయ నిర్మల 2019 జూన్ 27న మరణించగా, ఇందిరా దేవి సెప్టెంబర్ 28న కన్నుమూశారు. పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో ఈ జనవరి నెలలో కన్నుమూశారు.
1965లో తేనే మనసులు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన కృష్ణ గూడాచారి 116 తో తెలుగు తెరపై తొలి కౌబాయ్ సినిమా తో పాటు ఆయనకు హీరోగా తిరుగులేని గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగు సినీ జగత్తులో అగ్ర కథానాయకుడిగా సత్తా చాటి సూపర్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నారు. ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా కూడా అయన ఖ్యాతి సంపాదించారు. సున్నిత మనస్కుడైన కృష్ణ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే తిరిగి అదే నిర్మాతకు డేట్లు ఇచ్చి మరో సినిమా ఉచితంగా చేసి ఆ నిర్మాత ఆర్ధికంగా నిలదోక్కుకునేలా చేసేవారు. నిర్మాతలకు కొంగు బంగారంగా భావిస్తుంటారు. 2016లో అయన శ్రీ శ్రీ అనే సినిమాలో నటించారు. అదే అయన చివరి సినిమా.
కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు బాలనటుడిగా వెండితెర ఆరంగ్రేటం చేసి ప్రస్తుతం సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.