తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటిందన్నారు. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అద్భుతంగా పనిచేస్తున్నదని కితాబిచ్చారు. తొలిరెండు స్పేస్‌టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని వెల్లడించారు.
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండటం ఐటీ ఇండస్ట్రీకి గర్వకారణమని హైసియా ప్రెసిడెంట్ మనీషా అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చేందుతున్నదని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చాలా అనుకూలమైన ప్రాంతమని ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. ఐటీ రంగంలో గత రెండేండ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో ఐటీ ఇండస్ట్రీ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.