వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉందని, సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా చేరుతున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగా 26 సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసి, పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా రూ 2,05,109 కోట్లు డిబిటి ద్వారా అందించామని వెల్లడించారు. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, తమకు కావాల్సిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, కానీ తమ హయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాలు, కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సంక్షేమం అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై విపక్ష నేతలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఓ ప్రకటనను బుగ్గన విడుదల చేశారు.
తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE)గా ఉంటే, భారతదేశానిది రూ. 1,72,000/- (2022-23 AE) గా ఉందని, దేశ తలసరి ఆదాయం కంటే మనది 27.6% ఎక్కువగా ఉందని, దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఆర్బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లడం సాధారణంగా జరిగేదేనని, ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్‌గా కూడా మారొచ్చని బుగ్గన విశ్లేషించారు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ గా పొందడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డిబిటి లాంటి అంశాల్లో వాస్తవాలు ఒకలా ఉంటే… యనమల , చంద్రబాబు తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. కొన్ని పత్రికల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధమని, సరైన అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా ఇలాంటివి రాస్తున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర, యువత భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు కానీ కేవలం వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలతో, అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసి, ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావడానికి టీడీపీ దుష్ట పన్నాగం పన్నుతోందని ఆరోపించారు.