Tuesday, September 17, 2024
HomeTrending Newsసోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

సోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో  ఉగ్రవాదులు ఈ రోజు (మంగళవారం) కాల్పులకు తెగబడటంతో కశ్మీర్ పండిట్ సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.  ఆయన సోదరుడు పింటూ కుమార్ గాయపడ్డాడు. ఉగ్రవాదులు వారం రోజుల వ్యవధిలో హిందువులపై  జరిపిన రెండవ దాడి ఇది.

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితులిద్దరూ హిందూ వర్గానికి చెందిన వారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాం. భద్రతా బలగాలు ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. మృతిచెందిన వ్యక్తిని సునీల్ కుమార్‌గా గుర్తించారు.

కశ్మీర్ పండిట్ కాల్చివేత ఘటన పట్ల గవర్నర్ మనోజ్ సిన్హా ఓ ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. సోపియాన్ జిల్లాలో పౌరులపై ఉగ్రవాదుల దాడి గుండెల్ని పిండేస్తోందని, మృతుని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానన్నారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇలాంటి పాశవిక చర్యలకు బాధ్యులైన ఉగ్రవాదులను విడిచి పెట్టే ప్రసక్తే లేదని  హెచ్చరించారు.

ఉగ్రవాదుల దుశ్చర్య పట్ల పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఉష్ట్రపక్షిలా (Ostrich) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

మూడు రోజుల క్రితం బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుని బండిపొర జిల్లాలో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని మధేపురకు చెందిన మహమ్మద్ అమ్రెజ్‌ అనే చేనేత కార్మికునిగా గుర్తించారు. ఈ ఏడాది ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నాలుగో స్థానికేతరుడు అమ్రెజ్ కావడం విశేషం. ఈ ఏడాది జరిగిన లక్షిత దాడుల్లో మొత్తం 14 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్