ప్రజల సమస్యలే అజెండాగా నడుస్తున్నంత కాలం ఏ కొత్త పార్టీలు వచ్చినా తాము భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పార్టీలు పెట్టడం అనేది వారిష్టమని, వారు పోటీ కూడా చేసుకోవచ్చని అన్నారు. ప్రజలను ఎంతమేరకు ప్రభావితం చేస్తామనేది ముఖ్యమని, దానిలో తాము చాలా ముందంజలో ఉన్నామని, కాబట్టి ఇలాంటి వాటిపై తాము ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. పోటీ పెరగడం అనేది మన పనితీరు మెరుగు పరచుకోవడానికి, ప్రజలతో మరింత మమేకం కావడానికి దోహద పడుతుందన్నారు. విధాన పరమైన నిర్ణయాలతో పార్టీలు వచ్చి పోటీ చేయడం అది ఆరోగ్యకరమైన పోటీకి దారి తీస్తుందన్నారు. ప్రజలకు కూడా ఇది మరింత మేలు చేస్తుందన్నారు. ఎన్నికల హామీలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామని, కొత్తపార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి చేశామని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ప్రజలు మరోసారి తమకే పట్టం కడతారన్న ధీమాను సజ్జల వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించడానికి కార్యాచరణ ఉంటుందని సజ్జల వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో…. ప్రభుత్వ వాదనను కూడా బలంగా వినిపించడానికి, వికేంద్రీకరణ వల్ల ఏమి ఉపయోగం ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. సహజంగానే ఒక రాజధాని తమ ప్రాంతానికి వస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఆహ్వానిస్తారని, అలాంటి విశాఖ కు వెళ్లి పాలనా రాజధానిగా వద్దని వారితో చెప్పించాలని చూడడం సహేతుకం కాదన్నారు. పవన్ కళ్యాణ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ ఒక తమ్ముడి గురించి అన్నగా ఎలా మాట్లాడతారో చిరంజీవి కూడా అలాగే మాట్లాడారని అన్నారు.
Also Read : భారత్ రాష్ట్రీయ సమితి..19న నిర్ణయం