Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజలకు నిజం తెలుసు: విజయసాయి

ప్రజలకు నిజం తెలుసు: విజయసాయి

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను బురిడీకొట్టించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు చెల్లబోవని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

“అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులు వంటి ప్రతిపాదనలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. మరో పక్క మూడున్నరేళ్లుగా ప్రతిపక్షంలో కునారిల్లుతున్న తెలుగుదేశం దిక్కుతోచని స్థితిలో దివాళాకోరు, చౌకబారు ఎత్తుగడలు వేస్తోంది. జనం నుంచి స్పందన లేక టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌ పూనకం వచ్చినట్టు ఎక్కడబడితే అక్కడ ఊగిపోతున్నారు. వారి నోళ్లకు హద్దూపద్దూ లేకుండా పోయాయి. చైతన్యరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం కార్యకర్తలు, చోటామోటా నేతలను తమ తప్పుడు వ్యూహాలతో తండ్రీకొడుకులిద్దరూ బలిచేస్తున్నారు.

తమ నేతల పోకడలు చూసి టీడీపీ కేడర్‌ బెంబేలెత్తిపోతోంది. ‘ఇలాంటి బుర్రలు లేని నేతలు మాకు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఖర్మకాకపోతే!’ అంటూ వారు తలలు పట్టుకుని వాపోతున్నారు. ఉత్తరాంధ్ర నగరం విశాఖపట్నం ఏపీ కార్యనిర్వాహక రాజధాని అవుతుందనే ప్రకటన వాస్తవరూపం దాల్చితే తమ గతి ఏమవుతుందనే దిగులుతో టీడీపీ నేతలు కొన్ని వారాల క్రితం ‘ఉత్తరాంధ్రను కాపాడాలంటూ’ కొత్త ‘ఏడుపు నాటకాలు’ మొదలుపెట్టారు. జనంలో పరువు పోగొట్టుకున్న తెలుగుదేశం మాజీ మంత్రులు, బెజవాడ నుంచి దిగుమతి చేసుకున్న ‘నయా నేతల’తో విశాఖ తీరంలో వేసిన వేషాలకు జనం నుంచి స్పందన రాలేదు. ప్రేక్షకులు కరవయ్యారు.

ఈ నేపథ్యంలో పార్టీ మాజీ సీఎం చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటనకు తెరతీశారు. కర్నూలు, ఎమ్మిగనూరు వంటి జనంతో రద్దీగా ఉండే పట్టణాల వీధుల్లో ‘రోడ్‌ షోలు’ పెట్టారు బాబు గారు. మాజీ హైటెక్‌ ముఖ్యమంత్రి నోటి మాటలతో అందించే వినోదం చూడడానికి వచ్చిన జనాన్ని చూసి రెచ్చిపోయారు. రెచ్చితే రెచ్చిపోయారుగాని, పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని, ఇతర సీనియర్‌ నేతలను రాయలసీమకు అన్యాయం చేసినవారిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నుంచి కలల రాజధాని అమరావతి చేరుకున్నాక కూడా చంద్రబాబు గారి గావు కేకలు, శాపనార్ధాలు ఆగలేదు. అధికారంలో ఉన్న ఏనాడూ తాను పుట్టి పెరిగిన, రాజకీయ జీవితం ప్రసాదించిన రాయలసీమ గురించి ఆలోచించని, ఈ ప్రాంతానికి మేలు చేయని చంద్రబాబు ఇప్పుడు ‘సీమ రక్షకుడి’గా నటిస్తున్నారు. ఎంత నటించినా ప్రజలకు నిజం ఏమిటో తెలుసు. ఎవరు సీమకు అన్యాయం చేసిన నాయకుడో వారికి అవగాహన ఉంది. కాబట్టి పదే పదే ముఖ్యమంత్రిని, ఇతర సీనియర్‌ మంత్రులపై అభాండాలు వేయడం ఎంత త్వరగా మానుకుంటే ఆయనకు అంత మంచిది” అంటూ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్