ఒకవేళ కుదిరితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, దానికి అవసరమైన మద్దతు తమ నుంచి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీ తరఫున తమ వాదనలు కోర్టులో బలంగా వినిపిస్తామన్నారు. విభజన చట్టం అసంబద్ధంగా ఉందంటూ సుప్రీం కోర్టులో ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై ప్రభుత్వం తన వాదన వినిపిస్తుందని చెప్పారు. విభజన జరిగి ఎనిమిదేళ్ళు పూర్తయ్యింది కాబట్టి సమస్యలపైనే తాము చర్చిస్తామని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని వివరించారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగాను. పనిగట్టుకొని సిఎం జగన్ ను వేలెత్తి చూపిస్తున్నట్లు అనిపించాయన్నారు. విభజన విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలేనన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన హామీలపై మొదటి నుంచీ పోరాడుతున్నది తమ పార్టీయేనని… రాష్ట్రం దురదృష్టకరంగా, అన్యాయంగా విభజించారని తమ పార్టీ, తమ నేత సిఎం జగన్ బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ మళ్ళీ ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాగలిగితే మొదట స్వాగతించేది తమ పార్టీయే అంటూ తేల్చి చెప్పారు. ఇది కాకపొతే విభజన హామీలు తప్పకుండా అమలు చేయాలని తాము పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.