Land Grabber: టిడిపి నేత అయ్యన్న పాత్రుడు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. అయ్యన్నకబ్జాల చరిత్ర అందరికీ తెలిసిందేనని, ఆయన భాగోతాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారని, అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకుంటే బీసీలపై దాడి అంటూ టిడిపి మాట్లాడడం హేయమన్నారు. తాను బీసీ కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా, చట్టం వదిలేయాలా అని నిలదీశారు. కబ్జాలు చేయడం చంద్రబాబు నైజమని, కబ్జాకోరులపై, పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎస్సీలు, మహిళలపై టిడిపి వైఖరి సరికాదని, యామిని, దివ్యవాణి ఎలా అవమానాలతో పార్టీ వదిలి పెట్టారో తెలుసుకోవాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అయ్యన్న విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఒక ఇల్లు కూల్చితే పది ఇళ్ళు కూలుస్తామంటూ టిడిపి నేత బుద్దా వెంకన్న చేసిన హెచ్చరికలను మంత్రి కారుమూరి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో బుద్ధా , అతని అనుచరులు చేసిన ఆగడాలను ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బిసి గర్జనలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానీ బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో వెలికి తీసి అందరికీ న్యాయం చేసేలా సిఎం జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారని కారుమూరు గుర్తు చేశారు.
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని, తాను ఉంటే కరోనా వచ్చేది కాదని మాట్లాడడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో తాను మెంటల్ గా ఫిట్ గా ఉన్నానంటూ ఆయనకు ఆయనే చెప్పుకోవడం వింతగా ఉందన్నారు కారుమూరి.