రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్ధులు, మహిళ సంఘాలు, సచివాలయ మహిళా ఉద్యోగులు మొత్తం 50 వేల మంది మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా పాలనా బాధ్యతలు నిర్వహిస్తోన్న కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ మహిళలే కావడం ఈ జిల్లా ప్రత్యేకత. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వరకు 10 కి.మి. మేర మానవహారం, ర్యాలీ సాగింది. కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం. పాటిల్ వాహనంపై నుంచి ర్యాలీగా గౌరవ వందనం స్వీకరించారు. ఆనంద గజపతి ఆడిటోరియం ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నమస్కరించారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్య పరచడం, తక్కువ వయసులో వివాహాలు జరగడం వల్ల కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించామని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి తెలియజేశారు. మహిళల్లో ధైర్యం కల్పించి వారికి విద్య ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో చైతన్య పరచడం ఈ మహిళా దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు,