కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నాశనం అవుతుందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. కేసీఆర్ కు ఓటేస్తే భవిష్యత్ మిమ్మల్ని క్షమించదని, పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు చల్లగా ఉంటారన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ దగ్గర ఈ రోజు జరిగిన రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు మర్లపాడు క్యాంప్ నుంచి షర్మిల 79 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. కేసీఆర్ ఊసరవెల్లిలా పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్న షర్మిల వైఎస్సార్ లాంటి న్యాయకత్వం కోసమే పార్టీ పెట్టాను అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే ఆ నాయకులు టీఆరెఎస్ కి మళ్ళీ అమ్ముడు పోతారని, బీజేపీ కి ఓటేస్తే మతతత్వ రాజకీయాలు చేస్తారని షర్మిల హెచ్చరించారు. బీజేపీ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని, విభజన హామీలు ఒక్కటి కూడా బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్న షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ దీవించిన రోజున వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పారు.
ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తామని, మొట్టమొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే చేస్తామని షర్మిల వెల్లడించారు. ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్ ఇస్తామని, ఎస్సీ,ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.
Also Read : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది-షర్మిల