రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలు, అభిమతానికి అనుగుణంగా పాలన ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత నాలుగేళ్ళుగా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సిఎం జగన్ పాలన కొనసాగుతోందన్నారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వరకూ రెండు వారాలపాటు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్నివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ ప్రచార పోస్టర్ ను సజ్జల ఆవిష్కరించారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్రజలు జగన్ పై తాము పెట్టుకున్న విశ్వాసం కంటే రెండింతలు ఎక్కువగా నిలబెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైందని సజ్జల చెప్పారు. జగన్ మా భవిష్యత్ అనే భావన వారిలో నెలకొందని అందుకే ఈ కార్యక్రమం పేరు కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని పెట్టామన్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కలుస్తామన్నారు.
దాదాపు ఏడు లక్షల మంది పార్టీ కార్యకర్తలతో కూడిన గృహ సారధులను నియమించుకున్నామని, వీరు సిఎం జగన్ ప్రతినిధులుగా ఒక కోటి 65లక్షల కుటుంబాలను కలుస్తారని, ఒక యజ్ఞంగా ఈ ప్రచార కార్యక్రమంగా జరగనుందని సజ్జల వివరించారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కర్తలు ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషిస్తారన్నారు. జగన్ సంక్షేమ రథానికి అడ్డు పడాలనే విపక్షాల ప్రయత్నానికి కూడా ఈ ప్రచార కార్యక్రమం దోహదం చేస్తుందని సజ్జల పేర్కొన్నారు.
Also Read : CM YS Jagan : ఎమ్మెల్సీ ఫలితాలపై ఆందోళన వద్దు: సిఎం జగన్