తెలంగాణలోని గిరిజనులకు జనాభా ప్రత్తిపాధికన 10 శాతం రిజర్వేషన్లు పెంచి అమలుచేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా హామీలు ఇవ్వటం కెసిఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా గిరిజన జెఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 6నుండి 10 శాతం రిజర్వేషన్లు పెంపు సాదనకై నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, కెసిఆర్ కుటిల రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ ఎంపిపి లావుడ్యా సంధ్యారాణి, జెడ్పిటిసి జాధవ్ అశ్వినిలతో పాటు జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ సంఘీభావం తెలిపారు.