కేసీఅర్ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టారన్నారు. గత 9 ఏళ్లుగా వేలాది గా కేసులు పెట్టారని, గిరిజనులను కేసీఅర్ వంచనకు గురి చేశాడని మండిపడ్డారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఈ రోజు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో వచ్చిన వెంటనే 4 నెలల్లో 13 లక్షల పట్టాలు మంజూరు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. గెలిచిన వెంటనే నేను నా బలగం వచ్చి కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తానన్న కెసిఆర్ 9 ఏళ్లుగా ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదన్నారు.
సిఎం కెసిఆర్ గిరిజన బందు అని మోసం చేశాడని, ఇంద్రవెల్లి ఘటన ఒక జలియన్ వాలా బాగ్ ను తలపించిందని షర్మిల అన్నారు. తెలంగాణ వస్తే మంచి రోజులు అని చెప్పాడని, ఇప్పుడు పట్టాలు అడిగితే జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ భూముల్లో ట్రెంచ్ లు వేస్తున్నారని, కేసీఅర్ గిరిజన ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10శాతం రిజర్వేషన్ అమలు అని చెప్పి పట్టించుకోలేదని, గిరిజన సంక్షేమం అని చెప్పి చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో కనీసం ఒక శాతం కూడా నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. అధికారంలో వచ్చాక ఆదివాసీల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని షర్మిల మాట ఇచ్చారు.