తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విస్మయం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం జగన్ రెడ్డి గాల్లో ప్రయాణించి వెళ్తే అటు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర, ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉందన్నారు. గంటల తరబడి వాహనాలు ఆపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారని మండిపడ్డారు.
రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి చర్యలు చూస్తుంటే ముఖ్యమంత్రికి అభద్రతాభావం పెరిగిపోతోందని నాదెండ్ల విమర్శించారు. భోగాపురానికి అటూయిటూ 150 కి.మీ. దూరాన హైవేపై వాహనాలు ఆపివేయడం పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్ట అన్నారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. సీఎం భోగాపురం పర్యటన నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్, శ్రీమతి పతివాడ కృష్ణవేణి, శ్రీ పతివాడ అచ్చన్నాయుడు, శ్రీ కారి అప్పలరాజు తదితరులను అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికమని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.