తొలిరోజు 280 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. రెండోరోజు మంగళవారం కూడా మిగిలిన ఎంపీలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ నియమించిన తీరుకు వ్యతిరేకంగా సమావేశాలు ప్రారంభం నుంచి విపక్ష కూటమి పార్టీల ఎంపీలంతా రాజ్యాంగ ప్రతులతో సభలో నిరసన తెలిపారు. రాజ్యాంగ ప్రతులతోనే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. పోడియం వద్దకు వెళ్లి ముందుగా తమ చేతిలో రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా కూటమి పార్టీల ఎంపీలంతా ఇదే విధానాన్ని అవలంభించారు.
తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ కె. గోపినాథ్ తెలుగులో ప్రమాణం చేసి ఆశ్చర్యపరిచారు. చివర్లో ‘జై తమిళనాడు’ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కృష్ణగిరి జిల్లా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నందున ఇక్కడి ప్రజలు తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషలు కూడా మాట్లాడతారు.
తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన ఎంపిలు నాలుగు బాషలలో చేశారు. ఆదిలాబాద్ ఎంపి గోడెం నగేష్ హిందీలో, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ, చేవెళ్ళ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆంగ్లంలో, హైదరాబద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. మిగతావారు తెలుగులో చేశారు. అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదం చేయటంతో బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. ప్రమాణ స్వీకార వ్యాఖ్యలు తప్పితే మిగతా నినాదాలు రికార్డులకు ఎక్కవని ప్రోటెం స్పీకర్ స్పష్టం చేయటంతో వివాదం సద్దుమణిగింది.
తృణముల్ కాంగ్రెస్ ఎంపి మహువా మైత్ర ప్రమాణ స్వీకారం చేసినపుడు ఆ పార్టీ సభ్యులు ప్రజాస్వామ్యం గెలిచిందని నినదించారు.
48 ఏళ్ళ తర్వాత లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రయత్నించింది. స్పీకర్ ఎన్నికకు సహరించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియా కూటమి నేతలను కోరారు. అయితే డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా కూటమి సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీకి దిగింది. కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌ను బరిలోకి దింపింది.
ఎన్డీయే తరఫున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా, విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహించినా ఎన్డీయే కూటమికి సభ్యుల బలం ఉన్నందున ఓం బిర్లా ఎన్నిక లాంచనమే కానుంది.
-దేశవేని భాస్కర్