Friday, November 22, 2024
HomeTrending Newsకొలువు దీరిన 18వ లోక్ సభ

కొలువు దీరిన 18వ లోక్ సభ

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు రాష్ట్రాల వారిగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది.

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ సభ్యత్వానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజీనామాను లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ఆమోదించారు. ఇవాళ(సోమవారం) ఉదయం 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం రాహుల్‌ రాజీనామాను ఆమోదించారు.

కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్‌ అంటూ  నినాదాలు చేశారు. ‘నీట్‌.. నీట్‌.. నీట్‌..’ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అంతకు ముందు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఏడు సార్లు ఎంపీగా భర్తృహరి మహతాబ్‌ ఎన్నికపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్తృహరి కంటే కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ సీనియర్‌ అని, దళితుడైనందున సురేశ్‌కు ప్రొటెం స్పీకర్‌ పదవి ఇవ్వలేదని ఆరోపించారు. విపక్షాల ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్‌ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్‌ అలా కాలేదని చెప్పారు. సురేశ్‌ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

ఈ నెల 27వ తేదిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్‌ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోడీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్