Friday, September 20, 2024

రాజీ మార్గం

Pedda Kadabur Children:
కర్నూలు జిల్లా పెద్ద కడబూరు లో ఒకరోజు ఎప్పటిలా సూర్యుడు ఉదయించాడు.
పక్షులు కిల కిలమంటూ కొమ్మలు వదిలి ఆకాశంలోకి ఎగిరాయి. రైతులు పొలాల్లోకి వెళ్లారు. పిల్లలు యూనిఫార్మ్ లతో చందమామల్లా స్కూళ్లకు వెళ్లారు. పెద్ద కడబూరు పోలీస్ స్టేషన్లో ఎప్పటిలా పోలీసులు డ్యూటీలకు హాజరయ్యారు. ఎండ పొద్దెక్కింది. పాత కేసులు జోగుతున్నాయి. కొత్త కేసులు మోగుతున్నాయి. ఈలోపు ఐదారేళ్ల పిల్లలు ఐదారుగురు పోలీస్ స్టేషన్లోకి వడి వడిగా వచ్చారు. వచ్చాక ఏమి జరిగిందో…ఈ వీడియో చూడండి.

ఆ ఊళ్లో రెండు వేరు వేరు స్కూల్ విద్యార్థులు. ఇద్దరి పేరు హనుమంతు. నిజానికి రాయలసీమలో హనుమంతప్పలు లేని వీధులు ఉండడానికి వీల్లేదు. అది వేరే విషయం.

ఒక హనుమంతు పెన్సిల్ ముక్కను, చిల్లరను ఇంకో హనుమంతు దొంగిలించాడన్నది సందర్భం. ఎవరో చెప్పినట్లున్నారు…హనుమంతును మరో హనుమంతు పోలీస్ స్టేషన్ కు ఇగ్గుకుని వచ్చినాడంట. ఇగ్గుకుని అంటే లాక్కుని.

పిల్లలను చూసి ఎంత ముద్దొచ్చిందో కానీ…స్టేషన్లో కూర్చున్న పోలీసు పిల్లలతో మాట్లాడుతూ సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. పిల్లలతో అతను మాట్లాడిన తీరు, పెద్ద మనసు చేసుకొని రాజీ చేసుకో హనుమంతు! అన్న మాట మనసును తాకుతుంది. కేసు పెట్టాల్సిందే…వాళ్లమ్మను తోడుకొస్తాను…అని హనుమంతు అయిష్టంగానే వెళ్లిపోయాడు. కేసులంటే బెయిలెలా వస్తుంది? ఇంకోసారి చేయడులే…బాగా చదువుకోండి…కేసులొద్దు…వెళ్లండి…అన్న పోలీసు మాట వేయి వరహాల మూట.

ఊరి పెద్ద మనుషుల మధ్యస్థంతో ఇలా ఎన్ని గొడవలు కేసుల దాకా వెళ్లకుండా రాజీ అయ్యేవో? పసి పిల్లలు కాబట్టి పోలీసులు ముద్దుగా సర్ది చెప్పి పంపగలిగారు. పెద్దవారిని కూడా ఇలాగే సముదాయించి కేసుల గొడవలు లేకుండా చేతులు కలిపించే పోలీసులు ఉంటే ఎంత బాగుంటుందో?

ఈ వీడియో తీసిన, మాట్లాడిన పోలీసు పేరు కనుక్కుని వార్తలో ప్రస్తావిద్దామని రెండ్రోజులుగా ప్రయత్నించాను. ఫలితం లేదు. ఎవరికయినా తెలిస్తే చెప్పండి…ఆయన పేరు రాస్తాను. పోలీసు రాజీ ప్రయత్నానికి, ఆయన మాటలకు, అన్నిటికి మించి ఈ వీడియో తీసినందుకు అభినందనలు.

నిజమే.

పెద్ద మనసు చేసుకుంటే ఎన్నెన్ని అగాథాలు వాటికవే పూడుకుపోతాయో?

ఎన్నెన్ని కలవని మనసులు…మళ్లీ కలుసుకుంటాయో?

మనసుకు పరిమితి లేదు. ఎంత పెద్దదయినా చేసుకోవచ్చు. పెద్ద మనసు చేసుకోవడానికి మనసుంటే చాలు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్