కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జులై 17న బెంగళూర్‌లో జరిగే విపక్ష పార్టీల తదుపరి సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాలని 24 పార్టీలకు ఆహ్వానం పంపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యత దిశగా తొలి సమావేశం జూన్ 23న పట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరించడంతో విపక్షాలను ఏకం చేయడంలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారని భావిస్తున్నారు. ఈనెల 17, 18న రెండు రోజుల పాటు 24 రాజకీయ పార్టీల నేతలు విపక్షాల ఐక్యతపై విస్తృతంగా చర్చిస్తారు. నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ భేటీలో కసరత్తు సాగిస్తారు.
బెంగళూర్ భేటీలో ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) వంటి మరో ఎనిమిది కొత్త పార్టీలు పాల్గొంటాయి. ఈ పార్టీలను కూడా విపక్ష సమావేశానికి ఆహ్వానించారు. పట్నాలో జరిగిన సమావేశంలో 15 విపక్ష పార్టీలు పాల్గొనగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి.