Saturday, April 20, 2024
Homeజాతీయం౩ వేల మంది రెసిడెంట్ డాక్టర్ల రాజీనామా

౩ వేల మంది రెసిడెంట్ డాక్టర్ల రాజీనామా

ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మధ్య ప్రదేశ్ లో మూడు వేల మంది రెసిడెంట్ డాక్టర్లు రాజీనామా చేశారు. ఏటా స్తైఫండ్ ఆరు శాతం పెంచాలని, కోవిడ్ బారిన పడే జూనియర్ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ మే 31 నుంచి రాష్రంలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న రెసిడెంట్ డాక్టర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు ఖచ్చితంగా పనిచేయాలనే నిబంధన తొలగించాలని, ప్రభుత్వ నియామకాల్లో అదనంగా పది మార్కులు కలపాలని కూడా డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి, గాంధీ మెడికల్ కాలేజ్ కు చెందిన డా. సౌరభ్ తివారీ స్పష్టం చేశారు. నేటినుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా విధులు బహిష్కరిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోడంతో మూడు వేల మంది రెసిడెంట్ డాక్టర్లు రాజీనామా చేశారని తెలిపారు.

జునియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె చట్ట విరుద్ధమని, 24 గంటలలోగా వారు విధుల్లో చేరాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు నిన్న గురువారం తీర్పు చెప్పింది. అయినా డాక్టర్లు తమ పట్టు వీడలేదు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు సుముఖంగా లేరని, హైకోర్టు ఈ సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పినందున వారు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. వారు కోర్టు ఆదేశాలు గౌరవిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు.

జూనియర్ డాక్టర్ల సమ్మెతో జబల్పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. జునియర్ డాక్టర్లు ప్రభుత్వోద్యోగులు కాదని, అలాంటప్పుడు వారు రాజీనామా చేశారన్న వార్తలకు అర్ధమే లేదని జబల్పూర్ డివిజనల్ కమిషనర్ చంద్రశేఖర్ చెప్పారు. కాగా, ఈ విషయమై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సమస్య పరిస్ఖరించాలని కోవిడ్ బాధితుల బంధువులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్