Thursday, April 25, 2024
Homeసినిమాసంగీతం ఉన్నంత కాలం బాలు ఉంటారు : చిరంజీవి

సంగీతం ఉన్నంత కాలం బాలు ఉంటారు : చిరంజీవి

జూన్ 4న శుక్రవారం ఎస్పీ బాలు 75వ పుట్టినరోజు. ఈ సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమం ప్రారంభమైంది. ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్‌లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రసారం అయింది.

‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమాన్ని డైలాగ్ కింగ్ సాయికుమార్ దీపోత్సవగీతంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. జీవితారాజశేఖర్, ఆర్పీపట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్ శంకర్, ప్రసన్నకుమార్, సురేష్ కొండేటి తదిరుతలు బాలుగారి చిత్ర పటానికి దీపారాధన నిర్వహించారు. అనంతరం యువ గాయనీ గాయకులు బాలుకు నివాళులర్పిస్తూ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘మనందరికీ అభిమాన పాత్రుడైన మన అందరి అన్నయ్య ఎస్పీ బాలుగారి జయంతిని అందరూ కలిసి ఒక వేదికపై ఘనంగా సెలబ్రేట్ చేయలేకపోతున్నామనే బాధగా ఉంది. ఈ 75వ జయంతి సందర్భంగా మీ అందరితో పాటు నేను కూడా ఇలా నివాళులర్పిస్తున్నా. అన్నయ్యతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబ పరంగా, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నేను బాలుగారు అంటే ఆయనకు నచ్చదు. అన్నయ్య అని పిలవమనేవారు. నా సినిమాలకు పాటలు పాడాలంటే ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. నా సినిమా జీవితంలో నా సక్సెస్‌కి సగం దోహదపడ్డ బాలుగారికి నేను నివాళుర్పిస్తున్నా. స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు ఆయన నా సినిమాలకు పాడారు. అందుకే నా సక్సెస్‌లో ఆయనకు సగభాగం ఇస్తా” అన్నారు.

“ నన్ను కమర్షిల్ సినిమాలే కాకుండా కళాత్మక సినిమాలు కూడా చేయమని చెప్పేవారు. కానీ అలాంటి సినిమాలు నేను చేస్తే నాకున్న ఇమేజ్ ప్రకారం నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందేమోనని నేను వెనకడుగు వేసేవాణ్ని. వ్యక్తిగతం బాలు అన్నయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్లంతా నన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు. మొన్న అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఎస్పీ వసంతతో, శుభలేక సుధాకర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆయన పరిస్థితి తెలుసుకున్నా. కానీ మనందరి దురదృష్టం ఆయన మనందరికీ దూరంగా వెళ్లిపోయారు” అని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

“అన్నయ్య కోసం వసంత స్వయంగా రాసి పాడిన పాట ఎంతో బాగుంది. ఆ పాటను ఆమె అనుమతితో ఈ రోజు విడుదల చేస్తున్నాం. ఈ రోజు హనుమాన్ చాలీసా పాట వింటున్నప్పుడు ఆయన పాడిందేనని గుర్తొచ్చింది. ఆ రకంగా సంగీతం ఉన్నంత వరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు. ఆయన ఎక్కడున్న శాంతంగా ఉండాలి. ఆయన అజరామరుడు.’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్