నివేదా థామస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. నటన పరంగా మాత్రమే ఆడియన్స్ ను ఆకట్టుకున్న అతికొద్ది మంది కథానాయికలలో ఆమె ఒకరు. తెలుగులో ఆమె చేసిన ‘జెంటిల్ మెన్’ .. ‘నిన్నుకోరి’ .. ‘118’ .. ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. అలాంటి నివేదాకి ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గాయనే చెప్పాలి. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన సినిమాగా ఇటీవల ’35’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘చిన్నకథ కాదు’ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 6వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది.
నంద కిశోర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రియదర్శి .. విశ్వనాథ్ .. గౌతమి .. కె భాగ్యరాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, విడుదలకి ముందే మంచి బజ్ వచ్చింది. థియేటర్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘ఆహా’వారు తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ కథ తిరుపతిలో మొదలవుతుంది. సత్యదేవ్ – సరస్వతి భార్యాభర్తలు. వారి సంతానమే అరుణ్ – వరుణ్. ఇద్దరు పిల్లలను బాగా చదివించడం కోసం ఈ తల్లిదండ్రులు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. చాలా తెలివైనవాడైనప్పటికీ మ్యాథ్స్ లో అరుణ్ వెనకబడుతూ ఉంటాడు. చివరికి తనకి 35 మార్కులు వస్తే చాలనుకునే స్థితికి అతను వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అనేది కథ. ఈ కథను సహజత్వానికి దగ్గరగా .. వినోదభరితంగా నడిపించడం వలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది.