Monday, January 20, 2025
HomeTrending Newsస్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు 40 ఏళ్ళు

స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు 40 ఏళ్ళు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ జరిగి 40 ఏండ్లు అయింది. పంజాబ్‌ అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంపై 1984 జూన్ 1 నుంచి 10వ తేది మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది.  సిక్కు మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, ఇతర సిక్కు తీవ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి తొలగించడానికి భారత సాయుధ బలగాలు నిర్వహించిన ఆపరేషన్.

పంజాబ్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని మొదలైన ఖలిస్తాని ఉద్యమం క్రమంగా ఉగ్రవాదం వైపు మళ్ళింది. స్వర్ణ దేవాలయం కేంద్రంగా ఖలిస్తానీలు దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఖలీస్థానీ వేర్పాటువాదాన్ని అణచి వేసేందుకు స్వర్ణ దేవాలయం కంప్లెక్స్‌పై భారత ప్రభుత్వం ఆపరేషన్‌ బ్లూస్టార్‌ అనే పేరుతో సైనిక చర్య చేపట్టింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు సైనిక చర్య చేపట్టారు.

ఇందుకు ప్రతీకారంగా అదే ఏడాది నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందిలోని సిక్కు గార్డ్స్ కాల్పులకు ఒడిగట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన సిక్కువ్యతిరేక అల్లర్లకు కూడా ఈ ఏడాది చివరి నాటికి 40 ఏండ్లు పూర్తి అవుతాయి.

ఈ రెండు ఘటనల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సిక్కు వేర్పాటువాదులు భారత వ్యతిరేక ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్‌డౌన్‌కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. ఒట్టావాలోని భారత హైకమిషన్‌, వాంకోవర్‌, టొరంటోలోని దౌత్య కార్యాయాలను ఈ నెల 6న లాక్‌డౌన్‌ చేయాలని సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) జనరల్‌ కౌన్సెల్‌ గురుపత్వంత్‌ పన్నూన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ముందస్తు నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు  నాటి సిక్కు మారణహోమాన్ని అధికారికంగా గుర్తించాలని న్యూ డెమెక్రటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) డిమాండ్ చేసింది. ఇటీవలి కాలంలో జరుగుతున్న భారత వ్యతిరేక ఖలిస్తాని అల్లర్లలో అధికంగా పాకిస్తానీ పంజాబీలు, ఇతర దేశాల్లో దశాబ్దాలుగా స్థిరపడ్డవారు పాల్గొంటున్నారు. భారత వ్యతిరేక శక్తులు వారికి అండగా నిలుస్తున్నాయి.

–దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్