Saturday, January 18, 2025
HomeTrending Newsఆసిఫాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

ఆసిఫాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గొడవలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుమారు 1000 మంది పోలీసులు జైనూర్‌లో పహారా కాస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు షాపుల్లోని మంటలను రెండు ఫైర్‌ ఇంజిన్లతో పూర్తిగా అదుపులోకి తెచ్చారు. జైనూర్‌లో గురువారం ఉదయం నుంచి 48 గంటలపాటు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ప్రకటించారు.

జైనూర్‌తోపాటు ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్‌, ఉట్నూర్‌, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మండలం కేంద్రంలోని ప్రతి గల్లీలో పోలీసులు కాపలా ఉన్నారు.

ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దౌత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) మహేశ్‌ భగవత్‌, నార్త్‌ జోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఆదిలాబాద్‌ ఎస్పీ గౌష్‌ ఆలం, బాలానగర్‌ డీసీపీ (ఆసిఫాబాద్‌ పాత ఎస్పీ) సురేశ్‌కుమార్‌ జైనూర్‌లోనే ఉంది పరిస్థితి సమీక్షిస్తున్నారు.

జైనూర్‌లోని ఓ వర్గానికి చెందిన పెద్దలతోపాటు, ఉట్నూర్‌లోని కుమ్రం భీం భవన్‌లో ఆదివాసీ నాయకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచించారు. జైనూర్‌కు వెళ్లే ఆరు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతరులెవరినీ అనుమతించడం లేదు. మీడియానూ బయటే ఆపేసి తిప్పి పంపించేస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్‌ అమలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, మీటింగ్‌ల నిర్వహణపై నిషేధం విధించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఘటనా స్థలికి వెళ్తుండగా ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అడ్డుకొని వెనక్కి పంపించారు. స్థానిక ఎమ్మెల్యేను బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో కొంతసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది.

ఘటన ఆగస్టు 31న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైనూరు మండలం దేవుగూడకు చెందిన 45 ఏళ్ల ఆదివాసీ మహిళపై ఆటోడ్రైవర్ మగ్దుం లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళను ఇష్టమొచ్చినట్టు చితకబాది తీవ్రంగా గాయపరిచాడు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

ఘటనపై ఆదివాసీ యువకులు ఆందోళనకు దిగారు. జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో నిరసన చేపట్టారు. ఆదివాసీలు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో జైనూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెచ్చిపోయిన ఆందోళనకారులు మార్కెట్‌లో తోపుడు బళ్లకు నిప్పుపెట్టారు. ఆ మంటలు రోడ్డుపక్కనున్న షాపులకు అంటుకున్నాయి.

కేంద్రమంత్రి బండి సంజయ్ డీజీపీకి ఫోన్ చేసి ఘటన వివరాలు తెలుసుకున్నారు. మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మగ్దూంకు శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జైనూర్ అల్లర్ల మీద వార్తలు రాసిన కొందరు జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేయటం వివాదస్పదం అయింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్