బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ నేడు ఆరంభమైంది. గుజరాత్, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మొదలైన ఈ మ్యాచ్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంటోనీ ఆల్బనీస్ లు హాజరయ్యారు. ఇద్దరు నేతలనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా లు లైన్ ఆర్ట్ తో గీసిన ఆయా నేతల చిత్రపటాలను బహుమతిగా అందించారు. అనతరం ఇరు ప్రధానులు తమ దేశాల కెప్టెన్లకు టోపీలు అందించారు. గోల్డ్ కోటెడ్ కారులో ప్రేక్షకులకు అభివాదం చేసుకుంటూ కలియదిరిగారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 75 ఏళ్ళ క్రితం జరిగింది, రెండు దేశాల మధ్య ఈ 75 ఏళ్ళ క్రికెట్ స్నేహ సంబంధాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను వారు తిలకించారు. రవిశాస్త్రి ఈ వేడుకకు యాంకర్ గా వ్యవహరించగా, హర్షా భోగ్లే టాస్ తంతు నడిపారు.
ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మూడో టెస్టులో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్లు స్మిత్ వెల్లడించాడు. ఇండియా జట్టులో ఒక మార్పు చేశారు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో షమిని జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.