కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 5జి స్పెక్ట్రం వేలం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.బిడ్డింగ్ విలువ కనీస అంచనాలను చేరలేకపోయింది.వరుసగా ఏడు రోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైనట్లు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కోసం బిడ్డింగ్ వేసింది. సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్ 19,867 మెగాహెడ్జ్ సహా ఇతర బ్యాండ్ల కోసం రూ.43,084 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు వేసింది. వొడాఫోన్ ఐడియా రూ.18,784 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కొనుగోలుకు ముందుకు వచ్చింది. అదానీ గ్రూపు కేవలం రూ.212 కోట్ల స్పెక్ట్రం కోసం మాత్రమే బిడ్డింగ్ వేయడం విశేషం.
మొత్తంగా రూ.1,50,173 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు నమోదయ్యాయని టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోని 22 సర్కిళ్లలోని స్పెక్ట్రం కోసం 40 రౌండ్ల పాటు వేలం జరిగిందన్నారు.10 బ్యాండ్లలో 72,098 మెగాహెడ్జెస్ స్పెక్ట్రానికి వేలం నిర్వహించింది. ఇందులో 51,236 మెగాహెడ్జెస్ లేదా 71 శాతం అమ్మేశారు.5జి బ్యాండ్లు అయినా 3300 ఎంహెచ్‌జడ్, 26 ఎంహెచ్‌జడ్, 26జిహెచ్‌జడ్‌కు మాత్రం మూడింట రెండొంతుల బిడ్లు వచ్చాయి.తొలి ఏడాది రూ.13,365 కోట్ల రెవెన్యూ రానుందని వైష్ణవ్ తెలిపారు. అక్టోబర్‌లో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వేలం ప్రక్రియ తొలి రోజు ఏకంగా రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లకు దాఖలు రాగా.. మిగతా ఆరు రోజుల్లో కేవలం రూ.6వేల కోట్ల లోపే బిడ్లు నమోదు కావడం గమనార్హం.
72,098 మెగాహెడ్జెస్ స్పెక్ట్రాన్ని వేలానికి పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.వీటి కనీస విలువ రూ.4.31 లక్షల కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా.. తాజా బిడ్డింగ్ గణంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం స్పెక్ట్రంలో 71 శాతం విక్రయించినప్పటికీ.. ప్రభుత్వ అంచనాల్లో కనీసం సగానికి చేరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ దఫా వేలంలోనూ టెల్కోలు అతి చౌకగా స్పెక్ట్రాన్ని దక్కించుకున్నారని విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానకు భారీగా గండి పడొచ్చని తెలుస్తోంది.
Also Read: విశాఖ స్టీల్ పై ప్రధానిని కలుస్తాం: వైసీపీ