ప్రవాస ఉస్మానియన్ల సహకారంతో త్వరలోనే ఓయూ క్యాంపస్ లో పలు స్టార్టప్ లు ప్రారంభించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ తెలిపారు. ఇందుకు ప్రఖ్యాత కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. అమెరికా పర్యటలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటిస్తున్న ఆయన… డే ఏరియాలో ఏర్పాటు చేసిన ఓయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. అమెరికా పర్యటన ద్వారా ఓయూ పురోభివృద్ధికి ఎంతో మేలు జరగనుందని అన్నారు.. త్వరలోనే 90 రోజుల ప్రణాళిక ద్వారా…. అమెరికా పర్యటన ద్వారా వచ్చిన ప్రతిపాదనలను అమలు చేసే క్రతువు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. నెల రోజలుగా అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో పర్యటన ఆయన… ఈ సందర్భంగా ఓయూ అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిపాదనలను వివరించారు.
ఓయూ అభివృద్ధి కోసం శాన్ ప్రాన్సిస్కో సమావేశం నిర్మాణాత్మక సూచనలు చేసింది. హాస్టల్ భవనాలు సహా విద్యార్థులకు ఉపయోగపడే ఏ విధమైన సహకారాన్ని అందించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు పూర్వవిద్యార్థులు వెల్లడించారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయలన్నీ 50 శాతం దాతృత్వ నిధులతోనే నడుస్తాయని…. ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థులకున్న సామర్థ్యం ఇంతకు తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు. తాము చదువుకున్న విశ్వ విద్యాలయానికి ఎంత ఇచ్చినా తక్కువేనని… త్వరలోనే ఉస్మానియాను సందర్శించి తమ సహకారాన్ని అందిస్తామని పలు కంపెనీల సీఈఓలు, ఉద్యోగులు స్పష్టం చేశారు. అకడమిక్ – ఇండస్ట్రీ ఇంటర్న్ షిప్, విద్యార్థులకు అవగాహన, అధ్యయనం చేసే వీలున్న పర్యటనలు చేపట్టాలని వీసీకి పూర్వ విద్యార్థులు సూచించారు.
ఆపిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ సహా ప్రముఖ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నదాదాపు వందమందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. యూనివర్శిటీని సందర్శించి… తమ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని ప్రొఫెసర్ రవిందర్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. హాస్టల్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన ఓ పూర్వ విద్యార్థి….త్వరలోనే ఓయూను సందర్శించి ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఓయూలోని సీఎఫ్ఆర్డీ భవనంలో ఇప్పటికే అల్యూమినై సెల్, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశామని… ఇందుకు సంబంధించిన సమన్వయాన్ని మరింత పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా వీసీ వారికి వివరించారు. పూర్వ విద్యార్థులు ఇచ్చే ప్రతి సహకారానికి జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారిలో సాయి గండవెల్లి, విజయ్ చవ్వ, డాక్టర్ నదీమ్, మంజూర్, ముత్తు, సాగర్, మహేశ్ కొండూరి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.