Saturday, November 23, 2024
HomeTrending NewsBro: ఢిల్లీకి అంబటి- బ్రో లావాదేవీలపై ఫిర్యాదు

Bro: ఢిల్లీకి అంబటి- బ్రో లావాదేవీలపై ఫిర్యాదు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు  ఆయన ఫిర్యాదు చేయనున్నారు.  పవన్ కళ్యాణ్ కు  చంద్రబాబు  ఇవ్వాల్సిన ప్యాకేజీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అందిస్తున్నారని నిన్న రాంబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. బ్రో సినిమాకు సోమవారం నాటికి 55.26 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చిందని వెల్లడించారు.

నిర్మాత విశ్వప్రసాద్ కు అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయని,  టీడీపీ బ్యాచ్ అమెరికాలో డబ్బులు కలెక్షన్ చేసి విశ్వప్రసాద్ కి ఇస్తే…ఆ సొమ్మును పవన్ కి ప్యాకేజీ రూపం లో ఇచ్చి సినిమా తీశారని రాంబాబు సంచలన ఆరోపణ చేశారు.

ఈ సినిమాకి మొత్తంగా 60 కోట్లు వస్తే…దాంట్లో పవన్ కి ఇచ్చిందే 50 కోట్లు  ఇచ్చారని తెలిసిందన్నారు. సినిమాలు తీస్తే నాకు రోజుకి 2 కోట్లు వస్తాయని పవన్ చెప్పాడని,  ఈ సినిమాకి 23 రోజులు పవన్ పని చేశాడని కొందరు, 40 రోజులు పని చేశాడని మరికొందరు అంటున్నారని,  ఈ లెక్కన పవన్ 46 కోట్లు తీసుకున్నారా ? లేక 80 కోట్లు తీసుకున్నారా ? చెప్పాలని కోరారు.  నిర్మాత విశ్వప్రసాద్ తన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకే సినిమాలు తీస్తున్నారేమోనని రాంబాబు అన్నారు.

దీనిపై నిర్మాత పలు మీడియా ఛానల్స్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాంబాబు ఆరోపణలను ఖండించారు.  పవన్ కు ఎంత ఇచ్చిందీ చెప్పాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. జనసేన శ్రేణులు కూడా అంబటి ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ లు నిర్వహించాయి.  దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని రాంబాబు నిర్ణయించినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్