Friday, September 20, 2024
HomeTrending NewsTSMBBS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు

TSMBBS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. మెరిట్‌ జాబితా, వైద్య కళాశాలల వారీగా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs. telangana.gov.in లో పొందుపరిచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

యాజమాన్య కోటా సీట్లకు సైతం..

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు సైతం కాళోజీ విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. శుక్రవారం ఉదయం 10  నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. ఆయా దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజు యథాతథం

ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 2025-26 విద్యాసంవత్సరం వరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వార్షిక ఫీజు రూ.12 వేలుగా ఉంది. ఇదే ఫీజు మరో మూడేళ్లపాటు కొనసాగనుంది. ప్రైవేటు/ మైనార్టీ/ నాన్‌మైనార్టీ, ఈఎస్‌ఐ కాలేజీల్లో ఏ కేటగిరి (కన్వీనర్‌ కోటా) సీట్ల ఫీజునూ యథాతథంగా ఉంచారు. గతంలో ఏడాదికి రూ.60 వేలు ఉండగా రానున్న మూడేళ్లకు ఇదే మొత్తం కొనసాగనుంది.

ప్రైవేటు కాలేజీల్లో కొన్నింటిలో మార్పు

దక్కన్‌ కాలేజి ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో బీ కేటగిరి సీటుకు ఫీజు గతంలో రూ.14.5 లక్షలు ఉండగా రూ.12.50 లక్షలకు, షాదన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఫీజును రూ.14 లక్షల నుంచి రూ.12 లక్షలకు తగ్గించారు.

అపోలో వైద్య కళాశాల, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల్లో బీకేటగిరి సీట్ల ఫీజు రూ.12.5 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెంచారు.

మల్లారెడ్డి మహిళా మెడికల్‌ కాలేజీ, మమత అకాడమీ ఆఫ్‌మెడికల్‌ సైన్సెస్‌, మెడిసిటీ, ప్రతిమా, ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో బీకేటగిరి సీట్ల ఫీజు రూ.11.55 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెరిగింది.

ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజు రూ.45 వేలు యథాతథంగా ఉండగా, బీ కేటగిరి సీట్ల ఫీజుల్లోనూ ఎలాంటి మార్పులేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్