లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఫెర్నాండో విల్లవిసెన్‌సియోను ఓ ఎన్నికల ర్యాలీలో కాల్చి చంపారు. రాజధాని క్విటో నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ సాయుధుడు ఆయనపై కాల్పులు జరిపారు. ఆగస్టు 20వ తేదీ ఆ దేశానికి చెందిన తొలి దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు రెండు వారాల ముందే కీలకమైన అభ్యర్ధిని హత్య చేయడం ఈక్వెడార్‌లో కలకలంగా మారింది. 59 ఏళ్ల ఫెర్నాండోపై పలుమార్లు బుల్లెట్ల వర్షం కురిపించారు. క్విటో హైస్కూల్‌లో జరిగిన ర్యాలీ నుంచి వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు ఆఫీసర్ గాయపడ్డారు.
తొలుత ఫెర్నాండోపై ఆ సాయుధుడు గ్రేనేడ్ దాడి చేశారు. కానీ ఆ గ్రేనేడ్ పేలలేదు. ఈక్వెడార్ జాతీయ అసెంబ్లీలో ఫెర్నాండో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆ అసెంబ్లీని మే నెలలో రద్దు చేశారు. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే లీడింగ్‌లో ఉన్నారు. ఆ దేశంలో గ్యాంగ్ వార్ ఎక్కువగా ఉంది. డ్రగ్ మాఫియా కూడా నియంత్రణలో లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో.. ఈక్వెడార్‌లో జరుగుతున్న హింస గురించి ఫెర్నాడో ఫోకస్ చేశారు.