Friday, September 20, 2024
HomeTrending NewsNiger:అంతర్యుద్దం దిశగా నైజర్...భారత పౌరులకు సూచనలు

Niger:అంతర్యుద్దం దిశగా నైజర్…భారత పౌరులకు సూచనలు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని అక్కడున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని కోరింది. నైజర్‌లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక సూచన జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. నైజర్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించారు.

ప్రస్తుతం నైజర్‌ గగనతలాన్ని మూసివేశారని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల గుండా వెళ్లే వారు భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నైజర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు పునరాలోచించుకోవాలన్నారు. ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. నైజర్‌లో సుమారు 250 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారంతా భారత ఎంబసీలో పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. భారతీయులు సురక్షితంగా ఆ దేశాన్ని వీడేందుకు భారత ఎంబసీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.

నైజర్‌లో జూలై 26న సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను ఆర్మీ నిర్బంధించింది. అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. సైనిక తిరుగుబాటుపై ఆ దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శాంతి ఒప్పందాలకు ఆర్మీ చీఫ్‌ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ తిరుగుబాటు నాయకుడు, రాజకీయ నేత రిస్సా అగ్ బౌలా, సైనిక ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభించారు. అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తామని బుధవారం బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ రిపబ్లిక్ (సీఆర్‌ఆర్‌) ఫోర్స్‌, ఆర్మీ మధ్య పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంత ఆ దేశంలో అంతర్యుద్ద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నైజర్‌లో ఉన్న భారతీయులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్