కొంతకాలం క్రితం వరకూ వచ్చిన వెబ్ సిరీస్ ల పరిస్థితి వేరు .. ఈ మధ్య కాలంలో వస్తున్న వెబ్ సిరీస్ ల తీరు వేరు. కొంతకాలం క్రితం వెబ్ సిరీస్ ల విషయంలో బడ్జెట్ పరంగా ఒక పరిమితి కనిపించేది. తక్కువ ఖర్చుతో సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు చేస్తూ వెళ్లారు. ఈ తరహా స్టోరీస్ పట్ల ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్టు చూపిస్తూ వచ్చారు కూడా. కానీ ఇప్పుడు ఆ తరహా కంటెంట్ తో పాటు, చారిత్రక కథాంశంతో కూడిన వెబ్ సిరీస్ లు .. భారీ యాక్షన్ తో కూడిన వెబ్ సిరీస్ లు చేయడానికి వెనకాడకపోవడం కనిపిస్తోంది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి వచ్చిన వెబ్ సిరీస్ లను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘తాజ్’ .. ‘ది నైట్ మేనేజర్’ రీసెంటుగా వచ్చిన ‘కమెండో’ చూస్తే, వెబ్ సిరీస్ లు ఏ రేంజ్ వరకూ వెళ్లిపోయాయనేది అర్థమైపోతుంది. ‘తాజ్’ సెట్స్ .. ‘ది నైట్ మేనేజర్’ లొకేషన్స్ .. ‘కమెండో’ యాక్షన్ దృశ్యాలు చూస్తే, భారీ బాలీవుడ్ సినిమాల స్థాయికి ఎంతమాత్రం తీసిపోనివిగా కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వైపు చూసుకున్నా, క్వాలిటీ విషయంలో ఎంత మాత్రం రాజీపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సగటు ప్రేక్షకుడి చేతిలో హాలీవుడ్ సినిమాల లిస్టు ఉంది. ఏ సినిమా చూడాలి .. ఏ వెబ్ సిరీస్ ను చూడాలనే ఎంపిక అతని చేతిలోనే ఉంది. ఎవరికి తెలిసిన భాషలో వారు వీక్షించడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడి అంచనాలను అందుకునేలానే వెబ్ సిరీస్ లు ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. కంటెంట్ పరంగా కూడా తేలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువలన ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగులపై మరింత ఆసక్తి పెరుగుతూ పోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.