వచ్చే ఎన్నికల్లో బిజెపి-తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయాన్ని దమ్ముంటే పవన్ కళ్యాణ్ చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయడం ఎందుకని నిలదీశారు. వారు ముగ్గురూ కలిసి రావొచ్చని, ఎలక్షన్ దాకా ముగుసు వేసుకొని అప్పటికప్పుడు ముగుసు తీయాల్సిన అవసరం ఏముందని అన్నారు. తనకున్న సినీ గ్లామర్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు దగ్గర కూలి తీసుకున్నాడు కాబట్టి, దానికి తగ్గట్టుగా ఏదో మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. అది నిజమా- అబద్ధమా అనేది పట్టించుకోకుండా, జనం నవ్వుకుంటారని కూడా లేకుండా ఏదో ఒకటి మాట్లాడడం, జగన్ మీద బురద వేయడం, బాబుకు మేలు చేయడమే ఆయన ఉద్దేశమన్నారు. కిరాయి ఒప్పుకున్నాడు కాబట్టి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు సిఎం కావడమే తన లక్ష్యమన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ షంషేర్ గా చెప్పాలని ఛాలెంజ్ చేశారు. బాబు ముప్పై మినహా మిగిలిన సీట్లకు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారని అన్నారు. పవన్ 25-30 సీట్లకు మాత్రమే పోటీ చేస్తారని, అలాంటప్పుడు ఆయన సిఎం ఎలా అవుతారని నిలదీశారు. జగన్ దిగిపోవాలని అంటున్నారని, ఆయన దిగిపోతే నువ్వు ఎక్కుతావా అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలు తనకు సరిపడవన్న విషయం గ్రహించిన చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నారని, పవన్ తన అన్నను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
వైజాగ్ లో ఒక చోట అమ్మాయి అక్కడ వాలంటీర్ గా ఉంటే అక్కడకు వెళ్లి వాడెవడో వాలంటీర్ హత్య చేశాడని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఒకసారి వాలంటీర్లను తిడతారని, ఆ తరువాత ఆ వ్యవస్థను తానేమీ అనలేదని అంటాడని ఆయనవి అన్నీ నిలకడ లేని రాజకీయాలన్నారు. పవన్ కు నిజాయతీ ఉంటే 2014-19 వారకూ చంద్రబాబుతో కలిసి తాము అందించిన పాలన మళ్ళీ తీసుకువస్తానని చెప్పాలన్నారు.