స్వతంత్ర పోరాటంలో స్త్రీ శక్తి పాత్ర ఎంతగానో ఉందని, దేశ విభజన సమయంలో నారీ శక్తి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ వైపున నెహ్రూ జాతీయ జెండా ఎగరవేస్తుంటే అదే సమయంలో పంజాబ్ లో మహిళలపై అకృత్యాలు జరిగాయని అన్నారు. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వాతంత్ర్య సమరంలో స్త్రీలు చూపిన తెగువ, పోరాటం అమూల్యమైనవని, నేడు వారిని స్మరించుకునే ఉద్దేశంతోనే వీర మహిళలతో ఈ సమావేశం నిర్వహించామన్నారు.
ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమని, మేధస్సుతో సమాజంలో వారు రాణించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే పార్టీలో వీర మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళలపై దాడులను ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని, వీర మహిళలపై వైసీపీ నేతలు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మహిళలు, పిల్లలకు భద్రతా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తప్పును ప్రతిఘటించాలన్న విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలని సూచించారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తాము రాష్ట్రం వదిలి పారిపోతామని కొన్ని వర్గాలు అంటున్నాయని, కానీ ఈ నేల మీద పుట్టిన మనం ఎక్కడకు వెళ్తామని ప్రశ్నించారు.
జనసేన తరఫున త్వరలో ప్రజాకోర్టు కార్యక్రమం నిర్వహిస్తామని, తప్పు చేసే వారికి ప్రజా ప్రజా కోర్టులో ఏయే శిక్ష పడాలి, రాజ్యంగ ఉల్లంఘన జరిగితే ఎలా జరుగుతుందనే దానిపై దీనిలో చర్చిస్తామని అన్నారు. మహిళలపై జరుగుతోన్న దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయకపోతే మనకు హక్కులు ఎవరూ ఇవ్వరని స్పష్టం చేశారు.