Friday, September 20, 2024
HomeTrending NewsBRS: తొలిసారిగా బీడీ టేకేదారులకు పింఛన్‌

BRS: తొలిసారిగా బీడీ టేకేదారులకు పింఛన్‌

దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీకి ఈ రోజు (బుధవారం) సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్‌ పట్టణం వేదిక కానున్నది. మెదక్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ ఆఫీస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుమ్మడిదల, నర్సాపూర్‌, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్‌ చేరుకోనున్నారు. తొలుత ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయాన్ని, మధ్యాహ్నం 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్‌ సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

బీడీ టేకేదారులకు పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటామంటూ సీఎం కేసీఆర్‌ బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ లో ఈ హామీ ప్రకటించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున పింఛన్‌ను ఇచ్చే పథకానికి మెదక్‌లో శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,254 మంది టేకేదారులు లబ్ధి పొందనున్నారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నా, వారికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కావడం విశేషం. మెదక్‌లో సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల, టేకేదారుల పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకకాలంలో ప్రారంభించనున్నారు. టేకేదారులు, ప్యాకర్లు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని తెలంగాణ టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్‌సింగ్‌ తెలిపారు.

ఈ పథకం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల వారికి ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో బీడీ పరిశ్రమ ఎక్కువగా కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్