Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనకు ఆటలంటే మాటలే

మనకు ఆటలంటే మాటలే

Everything you need to know about sports – The Gaps in India’s Sports

ఆటలంటే మాటలు కాదు.
ఆటలంటే ఆటలు కూడా కాదు.
గెలిచే ప్రతి పతకం వెనుకా..
ఎగిరే ప్రతి పతాకం వెనుకా..
ఎన్ని జీవితాలు ఖర్చు అయివుంటాయో?
ఎన్ని ఆశలు ఆవిరి అయిపోయి వుంటాయో?
ఎన్ని కుటుంబాలు సర్వస్వం ధారపోసి వుంటాయో?
ఎన్ని కలల్ని, ఎన్ని ఇష్టాల్ని, ఎన్ని వదులుకుని వుంటారో?
ఎన్ని అడ్డంకుల్ని, ఎన్ని కష్టాల్ని దాటుకుని వచ్చుంటారో?
విశ్వవేదిక చేరేలోగా..
విశ్వవిజేతగా నిలిచే లోగా….
ఎన్ని అపజయాలో?
ఎన్ని అవమానాలో?
ఎంత పేదరికమో?
ఇంకెంత..నిరాదరణో?

మాటలు కోటలు దాటతాయి.
బడ్జెట్లు కోట్లు దాటుతాయి.
కానీ, అవి ఎటు పోతున్నాయో తెలియదు.
ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలియదు.
ఎక్కడా సౌకర్యాలు మెరుగయ్యాయో కనిపించదు.
ఎక్కడా ప్రతిభకి ప్రోత్సాహం కనిపించదు.
ఆటలంటే మనకి వట్టి మాటలే..
విజేతల వెన్నుతట్టి ఇచ్చేప్రసంగాలే..
ఆటలంటే మనకి కేవలం ఆటలే.
గెలిచినప్పుడు కొట్టే చప్పట్లే.
అష్టకష్టాలూపడి…
అన్ని అవాంతరాలనూ దాటి
నూటికో కోటికో ఒకరు గెలిస్తే..
పండగచేసుకుంటాం.
ట్వీట్లు, పోస్టులతో చెలరేగిపోతాం.
ప్రపంచస్థాయి పోటీల్లో మన సామూహిక వెనుకబాటుతనాన్ని
ఒకట్రెండు విజయాల మాటున దాచిపెట్టాలని చూస్తాం.The Gaps in India’s Sports

2016, 2021 కి మధ్య దేశజనాభా దాదాపు 7కోట్లు పెరిగింది.
మరి ఒలింపిక్స్ లో ఏడుపతకాలైనా అదనంగా గెలుస్తామా?
అసలు మొత్తం ఏడు పతకాలైనా గెలుస్తామా?
ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
తప్పెవరిది?
లోపమెక్కడుంది?
మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి.
ఓలింపిక్స్ లో మాత్రం భారతీయులు గెలవాలి అని కోరుకునే తల్లి దండ్రులదా?
స్పోర్ట్స్ పీరియడ్ ని మ్యాత్స్ టీచర్ కో.. కెమిస్ట్రీ టీచర్ కో ఇచ్చేసే స్కూళ్ళదా?
ఆటలనీ, చదువుని ఇంటిగ్రేట్ చేయలేని కరిక్కులమ్ దా?
క్రీడల్లో కూడా కెరీర్ వుంటుందని నమ్మకం ఇవ్వలేని స్పోర్ట్స్ పాలసీదా?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభని వెతకలేని ప్రభుత్వ విధానాలదా?
స్టేడియాలని ఫంక్షన్ హాళ్ళుగా మార్చేసే స్పోర్ట్స్ అథారిటీలదా?
రాజకీయనేతలకు పునరావాసంగా మారిన అసోసియేషన్లదా?
కాగితాల మీద కేటాయింపులే తప్ప..
వాస్తవంగా నిధులు విదల్చని ప్రభుత్వాలదా?

గెలిచిన వాళ్ళకి కోట్లు ఇవ్వడం కాదు..
గెలవాల్సిన వాళ్ళకి కాస్త ఆసరా ఇవ్వాలి.
ఇంత నిరాదరణలోనూ..
ఆటే ప్రాణంగా బతుకుతున్న వాళ్లు..
ప్రాణం పెట్టి ఆడుతున్న వాళ్ళు..
వీధికి పది మంది వుంటారు.
వాళ్ళను గుర్తించాలి.
వాళ్ళకి అండగా నిలవాలి.
చదువులోనే కాదు.
ఆటలోనూ జీవితముందని ధైర్యం ఇవ్వాలి.
ఊర్లో గెలిచిన వాడికి భుజం తడితే..
ఒలింపిక్స్ లో గెలవడం పెద్ద కష్టమేం కాదు.

-కే.శివప్రసాద్

Also Read: పెగాసస్ సెగ

Also Read:ప్రవీణ్ కొత్త ప్రయాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్