అడ్డగోలుగా ఓట్ల తొలగింపు ఇకపై కుదరదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిందని, అధికార పార్టీ ఓటర్ల జాబితాలో చేసిన అక్రమాలు అన్నిటిపైనా విచారిస్తుందని వెల్లడించారు. ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం చేసిన పోరాటం ఫలితంగానే కమిటీ ఏర్పాటయ్యిందని, సంపూర్ణంగా వెరిఫై చేసి బోగస్ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఓటు ఎక్కడ ఉండాలనేది పూర్తిగా ఓటరు ఇష్టమని అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ఇప్పటికే తొలగించిన ప్రతి ఓటును పరిశీలించాలని, అప్పుడే వాస్తవాలు బైటకు వస్తాయని, ఇకపై ఓటును తొలగించే ముందు ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన ఉండాలని, అభ్యంతరం వచ్చిన ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలన చేయాలసి ఉంటుందని కేశవ్ తెలిపారు. ఓటరు సంతృప్తి చెందితేనే ఓటును తొలగించాలని, విచ్చలవిడిగా ఓట్లు తొలగిస్తే అధికారులే బాధ్యులవుతారని, తహసీల్దార్లు కూడా కమిటీలో ఉన్నందున వాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాళ్లపై కేసు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్దేశించిందని…. ఉరకొండ ఓటర్ల జాబితా వ్యవహారంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ప్రారంభం మాత్రమే, వారిపై తదుపరి విచారణ కూడా ఉంటుందని కేశవ్ వెల్లడించారు.