చంద్రయాన్-3 విజయం వైజ్ఞానిక రంగంలో కొత్త శకానికి దారితీయగా… మరో చారిత్రాత్మక ఘట్టానికి తెర తీసే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కలహాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి. ‘చంద్రుని దక్షిణ ధృవంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది’ అని పాకిస్థాన్‌కు చెందిన చాలా వార్తాపత్రికలు, న్యూస్ వెబ్సైట్లు తమ హెడ్‌లైన్స్‌లో పేర్కొన్నాయి. ‘చంద్రయాన్-3 చివరకు చంద్రుడిపై దిగింది’ అన్న పేరుతో పాకిస్థాన్ జియో న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్‌కు చెందిన న్యూస్ ఇంటర్నేషనల్, డాన్ వార్తాపత్రిక, బిజినెస్ రికార్డర్, దునియా న్యూస్ వంటివి కూడా ‘చంద్రయాన్-3’ సక్సెస్ గురించి వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా సేకరించిన కథనాలను అందించాయి.
పాకిస్థాన్ మీడియాతో పాటు ఆ దేశ చట్టసభ్యులు కూడా భారత్ సాధించిన ఘనతను కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి ఇది గొప్ప క్షణమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి అన్నారు. ఇస్రో విజయం పట్ల భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. దీనికి ముందు చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ లైవ్ కవరేజ్ ఇవ్వాలని పాకిస్థాన్ మీడియాను కూడా ఆయన కోరారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా టాప్ మీడియా సంస్థలు కూడా ‘చంద్రయాన్-3’ విజయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.
గత రెండు రోజులుగా పాకిస్తాన్ మీడియా..ఆ దేశ ప్రజల స్పందన పరిశీలిస్తే భారత్ పట్ల సానుకూల దృక్పథం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోయి షాహబాజ్ ప్రభుత్వం రావటం తదనంతరం ఇమ్రాన్ జైలు కు వెళ్ళటం ఆ దేశ ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల వైముఖ్యం పెరుగుతోంది. దేశంలో మతోన్మాదం మితిమీరిందని పాక్ ప్రజలే ఏవగించుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
పాకిస్థాన్ లో గత ఏడాదిగా పరిణామాలను అవలోకనం చేస్తే… పాలకులు, మిలిటరీ – భారత్ తో సయోధ్యకు వచ్చేలా పాక్ ప్రజలే ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.