డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన దేవాలయాన్ని ఈరోజు గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అంతకుముందు దేవాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు సిఎం కేసిఆర్ ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేదం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అక్కడే నెలకొల్పిన మసీదు, చర్చిలను కూడా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ గతంలో మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయంశమైంది. అనేక అంశాల్లో రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈనెల మొదటి వారంలో అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను వివరణ కోసం గవర్నర్ పక్కన పెట్టడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఈ దశలో నిన్న కేబినేట్ మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం స్వీకారం తరువాత సిఎం కేసిఆర్ దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదే సమయంలో సచివాలయంలో ఏర్పాటు చేసిన దేవాలయాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి గవర్నర్ సమ్మతించారు. నేటి పరిణామాలతో విభేదాలకు తాత్కాలికంగా తెరపదినట్లు అయ్యింది.