రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘స్కంద- ది ఎటాకర్’. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్ గ్లింప్స్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్కోర్ చేసిన మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వున్నాయి. స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ ప్రీరిలీజ్ థండర్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘స్కంద’ అనే టైటిల్ కి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా భక్తి పారవశ్యాన్ని తెలియజేసు కుంటున్నాను. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా వుంది. బోయపాటితో సింహా, లెజెండ్ ,అఖండ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశాం. దీని తర్వాత ఏమిటి ? అన్నపుడు ఒక వీరసింహారెడ్డి చేశాను. అది కూడా ఘన విజయం సాధించింది. కొత్తదనాన్ని, నేపధ్యాన్ని ఆదరిస్తున్న అభిరుచి తెలుగు ప్రేక్షకులదే. విదేశాల్లో కూడా మన సినిమాకి బ్రహ్మ రధం పడుతున్నారంటే దానికి తార్కాణం ఇదే.
అది మా నాన్న గారితో మొదలైయింది. ఆయన ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలనే తపనతో, స్వలాభం కోసమే కాకుండా పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇస్మార్ట్ శంకర్ తో తమ్ముడు రామ్ నాకో సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను తెలంగాణ యాసలో భగవంత్ కేసరి చేశాను. ఆయన్ని నేను ఫాలో అవుతుంటే ఇపుడు నన్ను మళ్ళీ తను ఫాలోయ్యాడు. ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చేస్తున్నాడు. స్కంద సినిమా తప్పకుండా బాగా ఆడాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. బోయపాటి గారు చాలా అంకితభావంతో పని చేస్తారు. ఒకొక్క సినిమా మాకు ఒక సవాల్ . ఒక సినిమా జరుగుతున్నపుడు మరో సినిమా గురించి అలోచించం. సినిమాకి సినిమాకి వైవిధ్యం చూపించడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు.
తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అఖండ చెప్పింది. బాక్సులు రికార్డులు బద్దలైపోయాయి. దేవదాస్ నుంచి రామ్ ప్రయాణం చూస్తున్నాం. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఎంతో తపన వున్న నటుడు. మనం అందరం గర్వించదగ్గ నటుడు, కళామతల్లి మనకి ఇచ్చిన ఒక వరం రామ్ పోతినేని. తను మరిన్ని చిత్రాలు చేసి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీలీల పదహారణాల తెలుగమ్మాయి. అందం, అభినయం, నృతం అన్ని కలగలిపిన ప్రతిభ ఆమె సొంతం. భగవంత్ కేసరిలో తను నటిస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా తనలో ఎలాంటి అలసట కనిపించదు. తనకి మరింత పేరుప్రఖ్యాతలు రావాలి. సాయి మంజ్రేకర్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషించారు. నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టుకోవడంలో బోయపాటి గారు దిట్ట. నిర్మాత శ్రీనివాస చిట్టూరి గారు గ్రాండ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీకాంత్, ఇంద్రజ, మహేష్ గారు ఇలా ఎంతో మంది మంచి నటులు వున్నారు. స్టంట్ మాస్టర్ శివ గారు అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు. కెమరామెన్ సంతోష్ అద్భుతంగా విజువల్స్ ని చిత్రీకరించారు. సినిమాకి పని చేసిన అందరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ట్రైలర్ లో చూసినట్లే సినిమా కూడా కన్నుల విందుగా,చెవులకు ఇంపుగా వుంటుందనే నమ్మకం వుంది. అభిమానులు, పరిశ్రమ ఒక కుటుంబం. మంచి సినిమాలని ఆదరిస్తూ వాటిని విజయవంతం చేస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.