నగరిలో సిఎం జగన్ పాల్గొన్న విద్యా దీవెన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా తన పంచ్ డైలాగులతో చంద్రబాబు, పవన్ లపై విమర్శలు సంధించారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ- చంద్రబాబు వారంటీ కార్యక్రమం’ పై ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వెళ్లి గ్యారంటీ ఇవ్వడం కాదని, అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బాండ్లు ఇచ్చారని, అవి బ్యాంకుల్లో చెల్లడం లేదని, నాలుక గీసుకోవడానికి తప్ప దేనికీ పనికి రావడం లేదన్నారు.
‘వారంటీ లేని నువ్వు షూరిటీ ఇస్తే దానికి గ్యారంటీ ఏముంటుంది చంద్రబాబూ అని ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది’ అని రోజా వ్యాఖ్యానించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు కనీసం ఓ మంచి ఆలోచన, సంక్షేమ పథకం కూడా ఆయన బుర్రకు తట్టడం లేదని, అన్నీ జగనన్నను చూసి కాపీ కొడుతున్నారని విమర్శించారు.
సిఎం జగన్ ను చూసి పవన్ కళ్యాణ్ అసూయతో రగిలి పోతున్నారని, తనకన్నా చిన్నవాడు, తనకన్నా అందంగా ఉన్న జగన్ సిఎం కావడం చూసి జెలసీ ఫీల్ అవుతున్నారని, ఆరోగ్య శ్రీ కింద ఆయనకు చికిత్స ఇప్పించాలన్నారు.
రాష్ట్రంలో ఇంతమంది విద్యార్ధులకు విద్యా దీవెన అందిస్తున్న జగన్.. పవన్, చంద్రబాబులకు కూడా ఈ పథకం ఇవ్వాలని… పవన్ ఏమో ఇంటర్ లో ఏ గ్రూప్ చదివారని అడిగితే సిఈసి, ఎంపిసి, ఎంఈసి ఆని ఒక్కోసారి ఒక్కోటి చెబుతారని.. మరోవైపు చంద్రబాబు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసి చదవాలని చెబుతారని.. వీరికి విద్యా దీవెన ఇద్దామంటే ఇద్దరికీ ఏపీలో ఇళ్ళు లేవని, ఆధార కార్డు కూడా లేవని సిఎం తన విచక్షణాధికారం ఉపయోగించి ఇద్దరికీ విద్యా దీవెన అందించాలని కోరారు.