దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో మాజీ సిఈసి, మాజీ చీఫ్ జస్టిస్, లా కమిషన్ చైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు అనూహ్య ప్రకటన చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశంలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పద్ధతికి కేంద్రంలోని మోదీ సర్కార్ ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. జమిలి కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలి ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.