Saturday, November 23, 2024
HomeTrending NewsGolden Jubilee: ఘనంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

Golden Jubilee: ఘనంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రూపొందిన ‘భారతీయ భావన’ అన్న నాట్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. ఇందులో కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సితో పాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన ఇచ్చారు.

అనంతరం ‘ సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట సాగిన పలు వాయిద్యా లతో సాగిన జూగల్బందీ ఆద్యంతం ఆకట్టుకుంది. తబలా ఫ్లూటు ఘటం గిటారా డప్పు తదితర వాయిద్యాలతో కొనసాగిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. అనంతరం మంజుల రామస్వామి బృందంచే ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అనంతరం.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందేశాన్ని అందించారు.

గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. భారత వజ్రోత్సవాలలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర ను, తమ కోసం ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని అన్నారు. స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు… తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారని, వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. విచిత్రం ఏమిటంటే… వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు, సహా.. మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకిరణ్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, జి జగదీష్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సిఎం ఓ అధికార్లు, ప్రభుత్వ సలహాదారు లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ఎ ఐ ఎస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్