సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. రైతు రుణమాఫీ, కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రారంభం, గృహలక్ష్మి, భూ పట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పింఛన్లు, వర్షాల పరిస్థితి తదితర అంశాలపై మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మంజూరు చేసిన 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, నూతన మండలాలకు మంజూరు చేసిన 40గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ భవనాల్లో ప్రారంభించాలని ఆదేశించారు.
ఇప్పటికీ ప్రారంభంకాని బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గృహలక్ష్మి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి, సమాచారశాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.