ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ (cooling utility player) తబ్రీడ్ (Tabreed) తెలంగాణలో తన భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తబ్రీద్ సంస్థ వాణిజ్య మరియు ఇతర రంగాల శీతలీకరణ కార్యక్రమాలకు పేరుగాంచింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆయా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ మౌలిక వసతుల) నిర్మాణం కోసం దాదాపు 1600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి ఆయా పారిశ్రామిక పార్కులకు శీతలీకరణ వసతులను అందించనున్నది. సంస్థ హైదరాబాద్ ఫార్మసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు ఈ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనున్నది. ఈ మౌలిక వసతుల కల్పన వలన పారిశ్రామిక పార్కులాలకు అవసరమైన కూలింగ్ మరియు స్టోరేజ్ అవసరాలను తీర్చేందుకు అవకాశం కలుగుతుంది. ఈ మేరకు సంస్థ లక్ష 25 వేల రిఫ్రిజిరేషన్ టన్నుల కూలింగ్ మౌలిక వసతులను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన 24 మిలియన్ టన్నుల కార్బన్ డ యాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ఈ లక్ష్యం పూర్తయితే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవబోతున్నది.
ఈ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కూలింగ్ సొల్యూషన్స్ మౌలిక వసతుల వలన బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ లక్ష్యాల మేరకు దాదాపు 6800 గిగా వాట్ల కరెంటుతో పాటు 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం ఈ సంస్థతో కలిసి చేపడుతున్న మౌలిక వసతుల కల్పన వలన ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న బల్క్ డ్రగ్ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన హరితమైన పరిష్కారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది.
ఈ మేరకు తబ్రీద్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్ వంటి కమర్షియల్ డిస్ట్రిక్ట్ (నిర్దేశిత వాణిజ్య ప్రాంతాలు) తో పాటు రానున్న ప్రాంతాలలోనూ 2 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ను తగ్గించేలా కార్బన్ డయాక్సైడ్ య ఉద్గారాలను తగ్గించేలా సుదీర్ఘకాలం పాటు ఈ కూలింగ్ పరిష్కారాలను అందించేలా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తబ్రీద్ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) ఖలీద్ అల్ మర్జుకి ప్రతినిధి బృందం ఈరోజు మంత్రి కే తారక రామారావు తో దుబాయిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ ఫార్మసిటీ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.