తిరుమల నడక దారిలో చిరుతల సమస్యకు కర్రల పంపిణీ ఒక్కటే పరిష్కారం కాదని, కర్రలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ఉద్దేశం కాదని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి వద్ద నడకదారి భక్తులకు కర్రల పంపిణీ కార్యక్రమాన్ని నేడు టిటిడి ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులతో కలిసి భూమన ప్రారంభించారు. చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా దాడి చేయడానికి వెనుకంజ వేస్తుందన్నది సశాస్త్రీయమైన పరిశోధన అని… ప్రపంచంలో మానవులంతా సంవత్సరాల నుంచి పల్లెల్లో పొలానికి, అడవులకు వెళ్ళేటప్పుడు చేతి కర్ర తీసుకు వెళ్ళడం ఓ సంప్రదాయంగా వస్తోందని పేర్కొన్నారు.
తాము అడుగడుగునా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని టిటిడి సిబ్బంది, పోలీసులు నడకదారి భక్తులకు కాపలాగా ఉంటారని, దీనికి తోడు గా బోనులు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. భక్తుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. తాము తీసుకుంటున్న చర్యల్లో చేతి కర్ర ఒక భాగమని, దీనితో తమ పని అయిపోయిందని భావించడంలేదని చెప్పారు.
చేతిలో కర్ర ఉంటే భక్తుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని, దీనిపై విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బదులిచ్చారు. అలిపిరి వద్ద ఇస్తున్న కర్రలను నరసింహ తీర్ధం వద్ద వెనక్కు తీసుకుంటామన్నారు.