తెలంగాణలో వైద్య కళాశాలలు పెరిగాయని ప్రజలు సంబురపడుతుంటే… అదే వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ జాడ్యం ఇంకా కొనసాగుతోంది. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ర్యాగింగ్ సహించేది లేదని మంత్రి హరీష్ రావు పదే పదే వార్నింగ్ ఇస్తున్నా… ఫలితం ఉండటం లేదు.
తాజాగా సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఎంఈ, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రమేశ్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్‌తో కొందరు సీనియర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గాంధీ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఢిల్లీలోని యూజీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో యూజీసీ అధికారుల నుంచి గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ-మెయిల్ రావడంతో సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. సీనియర్లు, జూనియర్లను పిలిచి ర్యాగింగ్‌పై సమగ్ర విచారణ జరిపింది. అనంతరం 2021 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు, 2022 బ్యాచ్‌కు చెందిన మరో ఐదుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు డాక్టర్ రమేశ్‌రెడ్డి ప్రకటించారు.
అర్ధరాత్రి రూముల్లోకి పిలిచి మద్యం , సిగరెట్లు తాగిస్తూ… నగ్నంగా నృత్యాలు చేయించటం సీనియర్ విద్యార్థుల పైశాచికత్వానికి పరాకాష్ఠ. అయితే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సహచర విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు. విద్యా సంవత్సరం కోల్పోతారని..మానవతా దృక్పథంతో వదిలేయాలని ధర్నాకు దిగారు.
పోలీసులు, వైద్య కళాశాల అధికారులు విద్యార్థులను సముదాయించి ధర్నా విరమింప చేశారు. ధర్నాలో పాల్గొన్న వారు అంతా సీనియర్ విద్యార్థులే…ఒక జూనియర్ విద్యార్థి కూడా అందులో పాల్గొనలేదు. మీడియాతో మాట్లాడిన జూనియర్ విద్యార్థులు సస్పెన్షన్ ఎత్తివేయాలని కనీసం ఆఫ్ ది రికార్డు లో కూడా చెప్పలేదు.
మరోవైపు తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ జరుగుతున్నా బయటకు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పలుకుబడి గలవారి కాలేజీలు కావటంతో పేరు పోతుందని బాధిత విద్యార్థులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బడాబాబుల పిల్లలు చదవటం…అందులో కొందరు యాజమాన్య కోటాలో వచ్చిన విద్యార్థుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ర్యాగింగ్ చేశారని స్పష్టమైన ఆధారాలు ఉన్నా సస్పెన్షన్ ఎత్తివేయాలని సహచర విద్యార్థులు డిమాండ్ చేయటం…ర్యాగింగ్ తప్పు కాదన్న రీతిలో ఉంది. వారి డిమాండ్లు..ధర్నా చేసిన విద్యార్థులు ర్యాగింగ్ ను సమర్థించారు అనే అర్థం వస్తోంది.
ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించకుండా ప్రభుత్వం మొగ్గలోనే తుంచివేయాలి. లేదంటే విద్యావనంలో గంజాయి మొక్కలు ఏపుగా ఏదిగే ప్రమాదం పొంచి ఉంది.