నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. ఆ సినిమాతో ఆయన నార్త్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అయితే ఆ తరువాత ఆయన చేసిన ‘స్పై’ సినిమా మాత్రం దెబ్బకొట్టేసింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైనప్పటికీ, కథాకథనాల పరంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా ఆయనను చాలా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘స్వయంభూ’పైనే పెట్టుకున్నాడు.
నిఖిల్ ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో చేస్తున్నాడు. భువన్ – శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ .. యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ .. ఈ సినిమా కాన్సెప్ట్ పై అందరిలో ఆసక్తినీ .. అంచనాలను పెంచుతున్నాయి. ఇక రీసెంట్ గా వదిలిన అందమైన శిల్పం ఫొటో కూడా ప్రేక్షకులలో కుతూహలాన్ని పెంచుతోంది. మొత్తానికి ఇది సాధారణమైన కథ అయితే కాదు .. ఏదో కొత్తదనమైతే ఉందనే అభిప్రాయానికి ఆడియన్స్ వచ్చారు.
నిఖిల్ జోడీగా ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కనిపించనుంది. రవి బస్రూర్ సంగీతం .. మనోజ్ పరమహంస కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టడం ఖాయమనే ఒక టాక్ అయితే వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.