Friday, September 20, 2024
HomeTrending NewsMedia: తప్పుడు వార్తలు..ప్రచారం... మీడియా పోకడ

Media: తప్పుడు వార్తలు..ప్రచారం… మీడియా పోకడ

వాస్తవంతో సంభందం లేదు !
ఉమ్మెత్త కాయకు, రంగు పూసి మారేడు కాయో, మామిడి కాయో చేసి ఎలా ప్రెజెంట్ చేసాం ? , జనాల్ని ఎంత గట్టిగా నమ్మించాం అనేది ముఖ్యం! ..
ప్రజలు బకరాలు. ఎంతగా నమ్మిస్తే అంత పెద్ద టోకరా ! .. ఇదీ రాజకీయుల ఫిలాసఫీ .. మెథడాలజీ.

 

బ్రిటిష్ కాలంలో ప్రజలని చైతన్య పరచడానికి పత్రికలు వచ్చాయి. ఆ రోజుల్లో పత్రికలు, వాస్తవ చిత్రాన్నే ప్రజలముందుంచాయి అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది… కానీ చాలా వరకు సేవా దృక్ఫధంతో నడిచిన పత్రికలు, ప్రజల్లో చైతన్యం తెచ్చాయి.

బ్రిటిష్ కాలం దోపిడీ యుగం .. అణచివేత కాలం.

కష్టాల్లో ఉన్నవారికి ఇంగిత జ్ఞానం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. స్వాతంత్రోద్యమ కాలంలో వెల్లివిరిసిన ఈ చైతన్యం, అటుపై కొన్నేళ్ళు అలాగే కొనసాగింది.

నెమ్మదిగా… 1970 దశకం నుంచి పత్రికలు ” మాయా కళను “నేర్చుకొన్నాయి. వాస్తవంతో సంభంధం లేకుండా కనికట్టు వార్తలు ఒక పద్దతిగా పెరుగుతూ వచ్చాయి.

1990 దశకానికొచ్చేటప్పటికి ఇది పతాక స్థాయికి చేరుకొంది.

తొలి రోజుల్లో తిమ్మిని బమ్మిని చేయడం కేవలం రాజకీయ విషయాలకే పరిమితం. జనాల్ని విజయవంతంగా మోసగించడంతో వారి ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆర్థిక రంగం విద్య, వైద్యం, లైఫ్ స్టైల్ ఇలా అన్ని రంగాలకు సంభందించి వాస్తవాలతో సంభంధం లేకుండా మాయా వార్తల ప్రచురణ మొదలయ్యింది.

1990 దశకంలో మన దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలు కావడంతో బహుళ జాతి సంస్థలు పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేసాయి. తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకోవడం ఎలాగో వీరికి మహా బాగా తెలుసు. ప్రకటనలు ఇవ్వడం పాత పధ్ధతి. దాన్ని పట్టించుకొనేవారు తక్కువ. వార్తా రూపంలో వస్తే జనాలు నమ్ముతారు. ప్రకటనలపై ఖర్చుపెట్టే డబ్బు… వార్తలకోసం ఖర్చు పెట్టడం మొదలయ్యింది.

దిబ్బరొట్లు { అదేనండి పిజ్జా బర్గర్ లు }.. కక్కూసు కడిగే ఆసిడ్ లు { అదేనండి కోకు పెప్పు సి } బాగా అమ్ముడు పోవాలంటే ?

జనాలు ఫుట్ పాత్ లపై తక్కువ ధరకు దొరికే పానీ పూరి .. చెరుకు రసం లాంటి వాటికి అలవాటు పడ్డారు. ముందు ఇక్కడ దెబ్బ తీయాలి. వెంటనే వార్తలు పుట్టుకొచ్చాయి. చెరుకు రసం ఇంకా కూల్ డ్రింక్ లో వాడే ఐస్, శవాల మార్చరీ నుంచి వచ్చింది అనేది వార్త. ఎంత మంది ఆలా చేసారు ? కక్కూసు కడిగే ఆసిడ్ ద్రవాల్లో హానికారక రసాయనాలు లేవా? లాంటి విషయాలు అనవసరం. కుక్కను చంపాలి అంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వెయ్యాలి. చెరుకు రసం గురించో పానీపూరి గురించో మంచిగా రాస్తే ఏమొస్తుంది ? ముష్టి ? అదే సాంప్రదాయ తినుబండారాలపై రాయి విసిరితే డబ్బుల మూటలు. ఇరవై ఏళ్లలో ఎంత మార్పు ? ఇప్పుడు రోడ్ ల పై చెరుకు రసాల బండ్లు మాయం. పానీ పూరి బండ్లు మాయం .. ఇరానీ షాప్ లు మాయం ..

“మందు బాబులు” .. తెలుగు మీడియా తాగుబోతుల కోసం వాడిన పదం. అక్కడి దాకా బాగుంది. కానీ సోమవారం సెంటర్ స్ప్రెడ్ లో అప్పుడప్పుడే వెలుస్తున్న పబ్ ల లోపటి దృశ్యాలు. యువత .. జోష్. ఖుషి .. ట్రెండ్ .. ఇవీ వీరు ఇచ్చిన విశేషణాలు. బార్ లో తాగే వాడు మందు బాబు. పబ్ లో తాగితే ట్రెండ్ . జోష్ .

కుసింతయినా సిగ్గు లజ్జ లేకుండా పబ్ కల్చర్ ప్రొమోషన్. ఇరవై ఏళ్ళు అయ్యిందో లేదో .. తాగు పోతుల సంఖ్య దానితో పోటీ పడుతూ తాగుపడతుల సంఖ్య ఇబ్బుడిముబ్బిడిగా పెరిగిపోయింది .

మల్టీప్లెక్స్ లు కట్టాలన్న ఆలోచన బడాబాబులకు వచ్చే సరికి.. పాత తరం థియేటర్ ల లో నల్లులు దోమలు పుట్టుకొచ్చాయి. అదే నండీ పిచ్చి కుక్క ముద్ర వేసే వార్తలు. ఇక్కడ తినుబండరాలు మహా కాస్ట్లీ అయిపోయాయి. ప్లాస్టిక్ కవర్ లో రూపాయికి పాప్ కార్న్ అమ్మేవారు దోపిడీ దారులయిపోయారు. { సమస్య లేదు అని చెప్పడం లేదు. కానీ సమస్య ఏ స్థాయిలో వుంది ? నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు అనేది పాయింట్. అన్నట్టు ఇప్పుడు మల్టీప్లెక్స్ ల సీట్ లు కంపుకొట్టడం,  అక్కడ ఒకసారి అగ్నిప్రమాదం జరిగితే వందలాది మంది మాడి మసై పోయే ప్రమాదం ఉండడం, టాయిలెట్ బకెట్ లాంటి దాంట్లో పాప్ కార్న్ వందల రూపాయిల రేట్ కు అమ్మడం .. లాంటివి కనపడడం లేదా ?. కళ్ళు మూసుకొని పోయాయా ? }

మెడికల్ మార్కెటింగ్ .
కార్పొరేట్ ఆసుపత్రుల సంఖ్య పెరిగే కొద్దీ జనాల్లో ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించాలన్న సంకల్పం మీడియాకు బాగా పెరిగిపోయింది. జనాల ఆరోగ్యం పై ఎంత శ్రద్ధో !!

” పొద్దున్న లేచాక తుమ్మవా ?”
” వామ్మో ! అది టీబీ కావొచ్చు. కాన్సర్ కావొచ్చు. ఎయిడ్స్ కావొచ్చు, కుష్ఠు కావొచ్చు అనే విశ్లేషణలతో పత్రిక అనారోగ్య .. సారీ.. ఆరోగ్య పేజీ నిండి పొయ్యేది. వీటిని చదివిన వాడు .. ప్రతి మూడు రోజులకు ఒక్క సారి ఆసుపత్రులకు, డయాగ్నొస్టిక్ సెంటర్ ల కు వెళ్లి టెస్ట్ లు చేయించుకోవడం. డబ్బు సమర్పించుకోవడం . “ప్రపంచం లో అన్ని రోగాలు నాకే వుంది .. రోగమంటే మందులు మింగడమే” అనే తరాన్ని తయారు చేయడంలో వీరందరూ సూపర్ సక్సెఫుల్ .

మూడు విషపు రాతలు .. మూడు వందల టెస్ట్ లు .. ఆరు వందల మాత్రలు.
ప్రతి వీధిలో ఒక కార్పొరేట్ ఆసుపత్రి. ప్రతి ఇంట్లో ముగ్గురు రోగులు.
ఆహా… ప్రగతి అంటే ఇదే కదా !

ఈ లోగా నిరంతరం వార్తలందించే టీవీ చానెళ్లు వచ్చాయి.

పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే వార్త రాయాలంటే డబ్బు .. రాయకూడదంటే డబ్బు. అదేనండి పాజిటివ్ వార్త రావాలంటే డబ్బు ఇవ్వాలి. నెగటివ్ వార్తా రాకూడదంటే డబ్బు సమర్పించుకోవాలి.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మాట. మా బడి పిల్లలని సామాజిక అవగాహనా కార్యక్రమంలో భాగంగా చెంచల్ గూడా జైలుకు తీసుకొని వెళ్ళాము. ఆ సందర్భంగా ఖైదీల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము. మేము చేసినపనికి మీడియా ప్రశంసలు లభిస్తాయని జైలు నుంచి బయటకు వచ్చిన నాకు … గేట్ ముందే షాక్. ఈ వార్త ప్రసారం కావాలంటే ఇంత డబ్బులు అని అక్కడే బేరం.

అటుపై కాలంలో నాకు వాస్తవం బోధపడింది. చర్లపల్లి ఓపెన్ జైలులో ఖైదీలు పండించే కాయగూరలు లాంటివాటిలో రోజూ తమ వాటా అందక పొతే జైలులో అఘాయిత్యాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చేస్తాయి.
పాపం జైలు సూపెరిండెంటెంట్ .. {ఆ రోజుల్లో} చెప్పి బావురుమన్నాడు.

ఏనాడో జనాలు మరిచిన ఒక జాతీయ ఆంగ్ల పక్ష పత్రిక సర్వే లు ప్రచురిస్తుంది. హైదరాబాద్ లో ఉత్తమ పాఠశాల ఏది ? ఒక సంచికలో సర్వే.

అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి కదా?.. వందేళ్ల ఒక స్కూల్ కు మొదటి ప్లేస్ ఇచ్చేస్తే సరి. మిగతా స్థానాలు ఇంత ధరకు అని అమ్ముకోవచ్చు. అటుపై సంచికలో ఇంజనీరింగ్ కాలేజీ ల పై సర్వే. అటు పై లా కళాశాలలు. ఆసుపత్రులు .. ఇలా సర్వే ల రాజుగా ఇరవై ఏళ్ళు గా బతికేస్తోంది.

ఇది అంతగా గిట్టు బాటు కాలేదేమో .. ఇప్పుడు” ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది” అనే సర్వే లు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.

రాసుకొంటూ పొతే వందలు .. వేలు.
ప్రతి వార్తా జనాల్ని బురిడీ కొట్టించడానికి ఉద్దేశించిందే.
సత్యం వధ.. అంటే నిజాన్ని గొంతు నులిమి చంపడం..
పచ్చి అబద్దాన్ని ప్రచారం చేయడం.

కరోనా కాలంలో ఇది అన్ని హద్దులు దాటేసింది.
సోషల్ మీడియా అప్పటికి పుట్టుకొచ్చింది కాబట్టి జనాలు బతికి పోయారు.
లేకుంటే ఇంకెంత మంది కీర్తి శేషులయ్యేవారో !!

సోషల్ మీడియాను కూడా వదిలిపెడుతారా ?

ట్రెండ్ ను ముందుగానే కనిపెట్టి సోషల్ మీడియా చెల్లింపు రాత గాళ్ళను నియమించుకున్న రాజకీయులు.

విషయం అర్థం అయ్యేలోపు తమ రాతగాళ్ళు రాసిన మెసేజ్ ల ను వైరల్ చేసి… జనాల ఆలోచనల్ని విజవంతంగా హైజాక్ చేసారు. మూడో తరగతి చదవక పోయినా ఐఏఎస్ ల చే సెల్యూట్ కొట్టించుకొంటున్నారు .. వేల కోట్లు వెనకేస్తున్నారు అంటే .. రాజకీయుల అసామాన్య తేలితేటలు మరి. జనాల్ని బురిడీ కొట్టించడం వారికి స్కాచ్ తో పెట్టిన విద్య.

ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అయితే కంట్రోల్ చెయ్యడం సులభం. కానీ లక్షలాది మందిని చేయలేరు కదా.

నెమ్మదిగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.
సోషల్ మీడియా వల్ల సమస్యలు లేవా? అంటే ” బోలెడు “.
కానీ కలుగుతున్న లాభాల ముందు నష్టాలు తక్కువ.

1 . సోషల్ మీడియా లేకుంటే కరోనా వాక్ సీన్ లు ఆరునెలలకు ఒక సారి పొడిచేవారే . ఈ రోజు ప్రపంచమంతా ఈ వాక్ సీన్ గురించి వాస్తవాలను తెలుసుకొని గుండెపోట్లు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకొంది{ పోయి నోళ్లు పోగా } అంటే అది సోషల్ మీడియా పుణ్యమే.

2 . ఒకప్పుడు రాజకీయ నాయకుల సినీ జీవుల బ్యూరోక్రాట్ ల కామకలాపాలు బంగాళాఖాతమంత. ఇప్పుడు లేదని కాదు .. కానీ భయపడుతున్నారు . “రాజకీయాల్లో దూరినా సుఖం లేదేంటో?” అని నేటి రాజకీయులు మధన పడుతున్నారంటే ఆ క్రెడిట్ సోషల్ మీడియాకే.

౩.” ఒకటి “..”ఒకటి “…రాంక్ ల భాగోతం జనాలకు అర్థం అయ్యి పోయిందంటే .. నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లు వెచ్చించి మార్కెటింగ్ నిపుణులను రిక్రూట్ చేసుకొని కొత్త తరం పేరెంట్స్ చెవిలో పువ్వులు ఎలా పెట్టాలి? అని పధకాలు రచిస్తున్నాయంటే… కారణం సోషల్ మీడియా.

సమాచారం ఎవడి అబ్బ సొమ్మూ కాదు.

తెలియాలి .. జనాలకు నిజాలు తెలియాలి.

జనాల కోసం .. జనాలు చేత .. జనాల వల్ల సోషల్ మీడియా.

సత్యేమేవ జయతే !

RELATED ARTICLES

Most Popular

న్యూస్