ఇండియా- ఇంగ్లాండ్ జట్ల జరిగిన ట్రెంట్ బ్రిడ్జి లో జరుగుతోన్న మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది. నేడు మ్యాచ్ చివరిరోజు వర్షం కారణంగా ఆట కొనసాగించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. ఇండియా విజయానికి ఇంకా కేవలం 157 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. వరుణుడు ఇండియా విజయానికి అడ్డంకిగా మారాడని చెప్పవచ్చు.
ఆగస్ట్ 4న ప్రారంభమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 65.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ జో రూట్ 64 పరుతులతో అత్యధిక స్కోరు చేశాడు. బుమ్రా-4; షమీ-3; శార్దూల్ ఠాకూర్-2; వికెట్లు సాధించారు. సిరాజ్ మరో వికెట్ పడగొట్టాడు.
ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్-84; రవీంద్ర జడేజ-56, రోహిత్ శర్మ- 36 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్-4; రాబిన్సన్ -5 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 85.5 ఓవర్ల ఆడి 303 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో రాణించిన కెప్టెన్ జో రెండో ఇన్నింగ్స్ లో 109 పరుగులతో సెంచరీ సాధించడం విశేషం. బుమ్రా-5; సిరాజ్-2; శార్దూల్ ఠాకూర్-2; వికెట్లు సాధించారు. షమీకి ఒక వికెట్ దక్కింది.
209 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా నిన్న నాలుగో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ -12, పుజారా-12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ వర్షార్పణం కావడంతో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. జో రూట్ కు ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఇండియా- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఈ నెల 12 నుంచి లార్డ్స్ మైదానంలో జరగనుంది.